( ఫైల్ ఫోటో )
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు. నిప్పులు చేరిగే ఫాస్ట్ బౌలర్లు. కళ్లు చెదిరే ఫీల్డింగ్. ప్రతీసారి వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్. కానీ ఒక్కసారి కూడా ఆ జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్‌కు చేరినా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడ లేకపోయింది. ఈ ఉపోద్ఘామంతా ఏ జట్టు కోసం ఇప్పటికే మీకు అర్ధమైంది ఉంటుంది. అవును మీరు అనుకుంటున్నది నిజమే.
ఇదంతా వరల్డ్‌కప్‌లోలో బ్యాడ్ లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కోసమే. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో అదృష్టం కలిసిరాక ఇంటిదారి పడుతుంటుంది. గత 27 ఏళ్లగా వరల్డ్‌కప్ కోసం ప్రోటీస్ పోరాడుతోంది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ లక్ష్యంగా భారత గడ్డపై సఫారీలు అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసిరాని 5 మ్యాచ్‌లను ఓసారి చూద్దాం.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్..
1992 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇచ్చాయి. దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే మొట్ట మొదటి వరల్డ్‌కప్. ప్రోటీస్ జట్టు తొలి ప్రపంచకప్‌లోనే సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో కెప్లర్ వెసెల్స్ సారధ్యంలోని దక్షిణాఫ్రికా తలపడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్ కూడా లక్ష్య ఛేదనలో అదరగొట్టింది. ఆఖరి 13 బంతుల్లో విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న బ్రియాన్ మెక్‌మిలన్ (21), డేవ్ రిచర్డ్‌సన్(13) మంచి జోష్‌లో ఉన్నారు. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. దీంతో ప్రోటీస్ ఫైనల్‌కు చేరడం ఖాయమని అంతా భావించారు.
ఈ దశలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 1 బంతికి 22 పరుగులుగా విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో కేవలం 4 పరుగులు మాత్రమే సాధించిన సౌతాఫ్రికా.. 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అదృష్టం కలిసి రాకపోవడం ఇక్కడ నుంచే మొదలైంది.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా
ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ వరల్డ్‌క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది.
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్‌లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది.
ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. అనంతరం వీరిద్దరూ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం.
ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్‌లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది.
ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్‌గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌కు త్రో చేశాడు. గిల్‌క్రిస్ట్‌ను స్టంప్స్‌ను పడగొట్టాడు. మ్యాచ్ టై అయింది దీంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా శిబరం మొత్తం షాక్‌లో ఉండిపోయింది. అయితే రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు.
దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక
సొంత గడ్డపై జరిగిన 2003 ప్రపంచకప్‌లో శ్రీలంకతో ప్రోటీస్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. 45 ఓవర్ల తర్వాత ప్రొటీస్ లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో.. వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి చివరి బంతి ఆడిన మార్క్ బౌచర్ పరుగు చేయలేదు. బౌచర్ ఒక్క పరుగు కూడా తీసి ఉంటే దక్షిణాఫ్రికా విజయం సాధించి ఉండేది.
సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్
భారత్ వేదికగా జరిగిన 2011 వరల్డ్‌కప్ లీగ్ స్టేజిలో గ్రేమ్ స్మిత్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశ ముగిసే సమయానికి గ్రూప్ బి లో ప్రోటీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆరు గ్రూప్ దశ మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించింది. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సౌతాఫ్రికా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ప్రోటీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. సఫారీ బౌలర్ల దాటికి కివీస్ కేవలం 221 పరుగులు మాత్రమే చేయగల్గింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో పటిష్టస్ధితిలో నిలిచింది. క్రీజులో కల్లిస్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. ఈ సమయంలో కివీస్ పేసర్ టిమ్ సౌథీ.. కల్లిస్, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జెపీ డుమినీ వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్‌లో రనౌట్ రూపంలో డుప్లెసిస్ వికెట్‌ను కూడా ప్రోటీస్ కోల్పోయింది. దీంతో ప్రోటీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత కివీస్ స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ 172 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి 8 వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవదిలోనే దక్షిణాఫ్రికా కోల్పోయింది.
ప్రోటీస్ వర్సెస్ కివీస్
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టోర్నీ ఆసాంతం అదరగొట్టి సెమీఫైనల్‌కు చేరింది. కానీ సెమీస్ గండాన్ని ప్రోటీస్ గట్టెక్కలేకపోయింది. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్‌ను 298 పరుగులగా నిర్ధేశించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు బ్రాండెన్ మెక్‌కల్లమ్ , గుప్టిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం గ్రాంట్ ఇలియట్ కోరీ ఆండర్సన్ మధ్య కీలక భాగస్వామ్యంతో కివీస్‌ను విజయతీరాలకు చేర్చారు. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే 32 ఓవర్‌లో గ్రాంట్ ఇలియట్‌ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్‌ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. ఇందుకు దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment