ఒకవైపు బెర్లిన్ , బర్మింగ్‌హామ్, పారిస్... మరో వైపు మెక్సికో, అంటాల్యా, సాల్ట్‌లేక్ సిటీ... ఇంకోవైపు గ్వాంగ్జూ, బ్యాంకాక్, ఢాకా, టెహ్రాన్ , షాంఘై... నగరం పేరు మారితేనేమి...ఫలితం మాత్రం అదే! వేదికతో, ప్రత్యర్థులతో పని లేదు. ఒక్కసారి గురి పెడితే ఆ బాణం కచ్చితంగా లక్ష్యం చేరాల్సిందే! దాదాపు దశాబ్ద కాలంగా భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ చేస్తోంది అదే! వరుస విజయాలతో తనకంటూ ఎలాంటి పోటీ లేకుండా ఎదురు లేకుండా సాగిపోతోంది ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి.
ఎక్కడ బరిలోకి దిగినా తనదైన రీతిలో సత్తా చాటి పతకం ఖాయం చేసుకోవడం సురేఖకు అలవాటుగా మారిపోయింది. ప్రపంచ చాంపియన్ షిప్ అయినా ప్రపంచ కప్ అయినా సురేఖ సాగిస్తున్న విజయయాత్ర భారత ఆర్చరీలో అనితర సాధ్యం. ఏకంగా 48 అంతర్జాతీయ పతకాలు ఆమె ఖాతాలో ఉండటం విశేషం. తాజాగా భారత జట్టు ప్రపంచ వేదికపై తొలి స్వర్ణంతో మెరవడంలోనూ సురేఖదే కీలక పాత్ర.
మినీ నేషనల్ ఆర్చరీ చాంపియన్ షిప్, 2008... విజయవాడలో జరిగిన ఈ పోటీల్లో జ్యోతి సురేఖ కెరీర్‌లో తొలిసారి ఒక పతకం గెలుచుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు స్వర్ణాలతో మొదలైన ప్రస్థానం ప్రపంచ చాంపియన్ షిప్‌లో ఎనిమిది పతకాలు సాధించే వరకు, ప్రపంచ రికార్డులు నెలకొల్పే వరకు సాగుతోంది. అంతకు ఏడాది క్రితమే ఆమె మొదటిసారి ఆర్చరీ ఆటలోకి అడుగు పెట్టింది. అప్పటి వరకు ఆమెను మరో ఆటలో తీర్చిదిద్దాలని తండ్రి సురేంద్ర కుమార్, తల్లి శ్రీదుర్గ అనుకున్నారు.
అందుకే మూడేళ్ల వయసులో స్విమ్మింగ్ వైపు సురేఖను తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐదేళ్ల వయసు కూడా రాక ముందే సురేఖ ఐదు కిలోమీటర్ల పాటు కృష్ణా నదిని ఈది అరుదైన ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. దాంతో స్విమ్మర్‌గా ఆమె కెరీర్ మొదలైనట్లు అనిపించింది. అయితే కొంత కాలం తర్వాత స్విమ్మింగ్ ఈవెంట్లలో పోటీ పడే పరిస్థితికి వచ్చేసరికి అంతా మారిపోయింది. ఆమె బలహీనమైన కాళ్లు స్విమ్మింగ్‌లాంటి క్రీడాంశానికి సరిపోవని అక్కడి కోచ్‌లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్‌రెడ్డి చేతులమీదగా సత్కారం అందుకుంటున్న సురేఖ(2019)
క్రీడలంటే ఎంతో ఆసక్తి ఉన్న సురేంద్ర ఎలాగైనా తన కూతురిని క్రీడల్లో మేటిని చేద్దామనే లక్ష్యంతో ఉన్నాడు. దాంతో ప్రత్యామ్నాయం గురించి ఆయన ఆలోచించాడు. టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి రాకెట్ స్పోర్ట్ విషయంలో కూడా మున్ముందు ఇదే సమస్య ఎదురు కావచ్చని అనిపించింది. దాంతో అన్ని విధాలుగా ఆలోచించి సురేఖను ఆర్చరీ వైపు నడిపించాడు. అయితే ఆ నిర్ణయం ఎంత సరైనదో తర్వాత ఆయనకూ తెలిసింది. 11 ఏళ్ల వయసులో ఆర్చరీ విల్లును చేతిలో పెట్టినప్పుడు సురేఖ ఇంత దూరం వెళుతుందని, ఇన్ని ఘనతలు సాధిస్తుందని సురేంద్ర ఊహించలేదు.
కోచ్‌ల మార్గనిర్దేశనంలో...
విజయవాడలోనే మాజీ ఆటగాడు జె.రామారావు వద్ద సురేఖ ఆర్చరీలో ఓనమాలు నేర్చుకుంది. నాలుగేళ్ల పాటు కోచ్‌గా ఆయనే పూర్తి స్థాయి శిక్షణనివ్వడంతో సురేఖ ఆట మెరుగైంది. ఈ క్రమంలో 2011లో సురేఖ అరుదైన ఘనతను సాధించింది. జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తూ 15 ఏళ్ల వయసులో సీనియర్ చాంపియన గా అవతరించింది.
అదే ఏడాది సబ్ జూనియర్, జూనియర్ నేషనల్స్‌లో విజేత అయిన ఆమె మూడు వయో విభాగాల్లోనూ ఒకే ఏడాది చాంపియ¯Œ గా నిలిచిన తొలి ఆర్చర్‌గా నిలిచింది. ఈ దశలో సురేఖ మరింత ముందుకు వెళ్లాలంటే ఆమెకు అత్యుత్తమ స్థాయి శిక్షణ అవసరమని కోచ్ సూచించారు. దాంతో రెండేళ్ల పాటు సొంత ఖర్చులతో తండ్రి ఆమెను అమెరికా పంపించి కోచింగ్ ఇప్పించాడు. ఈ శిక్షణతో ఆమె ఆట ఎంతో మెరుగైంది. స్వదేశం తిరిగొచ్చాక దాని ఫలితం బాగా కనిపించింది. 2014లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా ఆర్చరీ గ్రాండ్ ప్రీ టోర్నీలో మిక్స్‌డ్, వ్యక్తిగత విభాగాల్లో ఒక్కో స్వర్ణం సాధించి సురేఖ అందరి దృష్టిలో నిలిచింది.
ఈ రెండు స్వర్ణాలు ఆమె కెరీర్‌కు బంగారు బాట వేశాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) జాతీయ క్యాంప్‌లో భారత చీఫ్ కోచ్ జీవ¯Œ జోత్ సింగ్ శిక్షణతో ఆమె కెరీర్ మరో మలుపు తిరిగింది. ఆయన కోచింగ్, మార్గనిర్దేశనం సురేఖను వరుస విజయాల వైపు నడిపించాయి. 2015 ఆసియా కప్‌లో సురేఖ ఖాతాలో తొలి వ్యక్తిగత అంతర్జాతీయ స్వర్ణం చేరింది. ఆ తర్వాత ఆమె ఎదురు లేకుండా సాగిపోయింది. సీనియర్ విభాగంలో 2014నుంచి 2023 వరకు ప్రతి ఏటా ఆమె పతకాలు గెలుస్తూనే రావడం విశేషం.
గెలుపే లక్ష్యంగా...
వ్యక్తిగత, మిక్స్‌డ్, టీమ్ విభాగాల్లో కలిపి సురేఖ ఇప్పటి వరకు 48 అంతర్జాతీయ పతకాలు గెలుచుకోగా, వాటిలో 16 స్వర్ణాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కూడా ఆమె 62 పతకాలు అందుకుంది. ఇటీవల బెర్లిన్‌లో జరిగిన పోటీల్లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం కూడా సాధించడంలో ఓవరాల్‌గా వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్‌లో ఆమె పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఏ రకంగా చూసినా ఈ ఘనత అసాధారణం. భారత ఆర్చరీ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో వరుసగా మూడు వరల్డ్ చాంపియన్ షిప్‌లలో పతకాలు గెలుచుకోవడం ఆమె ఘనతను చూపిస్తోంది.
అయితే సురేఖ పాల్గొనే కాంపౌండ్ ఈవెంట్ ఒలింపిక్స్‌లో క్రీడాంశం కాకపోవడం వల్ల ఆమె సాధించిన విజయాలకు తగినంత గుర్తింపు దక్కలేదు. ఒలింపిక్స్‌లో రికర్వ్ ఈవెంట్ మాత్రమే ఉండటంతో ఆమెకు ఒలింపిక్స్‌లో పోటీ పడే అవకాశమే దక్కలేదు. అయితే ఇదేమీ ఆమె స్థాయిని తగ్గించదు. కెరీర్‌లో వేగంగా ఎదుగుతున్న సమయంలో ఈవెంట్ మారే అవకాశం రాకపోగా, తర్వాతి ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ను చేరుస్తారంటూ వచ్చిన వార్తలతో పూర్తిగా తన ఆటపైనే సురేఖ దృష్టి పెట్టింది.
ఎక్కడ పోటీ పడినా గురి చూసి బాణాలు సంధించడం, పతకం సాధించడమే లక్ష్యంగా శ్రమించింది. సుదీర్ఘ కాలంగా సురేఖ భారత మహిళల ఆర్చరీకి ముఖచిత్రంగా మారింది. కఠోర శ్రమ, పట్టుదలతో పాటు మానసిక దృఢత్వం సురేఖను పదునైన ఆర్చర్‌గా మార్చాయి. ఇన్ని విజయాల తర్వాత కూడా నిర్విరామంగా సాధన చేస్తూ పోటీ పడుతున్న సురేఖ మున్ముందు మరిన్ని పతకాలు గెలుచుకోవడం ఖాయం.
713/720...
పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకోవడమే కాదు జ్యోతి సురేఖ పేరిట ప్రపంచ రికార్డు కూడా ఉంది. మహిళల కాంపౌండ్‌లో అత్యధిక పాయింట్లు స్కోరును ఆమె నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన వరల్డ్ కప్‌లో సురేఖ మొత్తం 720 పాయింట్లకుగాను 713 పాయింట్లు సాధించింది. 2015లో కొలంబియా ఆర్చర్ సారా లోపెజ్ సాధించిన వరల్డ్ రికార్డును ఆమె సమం చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 709 పాయింట్లతో ఉన్న ఆసియా రికార్డును కూడా ఆమె బద్దలు కొట్టింది. ఆటలో ఘనతలు సాధిస్తూనే చదువులోనూ మేటిగా ఉన్న సురేఖ బీటెక్ (కంప్యూటర్స్), ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తోంది.
మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment