ఆసీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ లోకల్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న VAP ట్రోఫీలో మైలాపోర్ రీక్రియేషన్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్.. నిన్న (సెప్టెంబర్ 19) యంగ్ స్టార్స్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌల్ చేసిన యాష్.. కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
20 నెలల కిందట చివరి అంతర్జాతీయ 50 ఓవర్ల మ్యాచ్ ఆడిన అశ్విన్.. ఈ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తూ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ తీయడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అశ్విన్‌పై అపార నమ్మకంతో భారత సెలెక్టర్లు అతన్ని త్వరలో జరుగనున్న ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. లోకల్ మ్యాచ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో యాష్ ఆసీస్‌పై కూడా చెలరేగాలని భావిస్తున్నాడు. అదే ఊపులో అతను వరల్డ్‌కప్ జట్టుకు కూడా ఎంపికై, భారత్‌ను జగజ్జేతగా నిలపాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌లకు భారత సెలక్టర్ల నుంచి అనూహ్యంగా పిలుపు అందిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిని ఆసీస్ సిరీస్‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు, వీరిలో ఒకరిని అక్షర్ స్థానంలో వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ సహా జట్టులోని మిగతా సభ్యుల సంపూర్ణ మద్దతు అశ్విన్‌కు ఉండటంతో అతని ఎంపిక లాంఛనమే అని అంతా అంటున్నారు. మరి 37 ఏళ్ల అశ్విన్ ఆసీస్‌తో సిరీస్‌లో ఏమేరకు రాణించి, వరల్డ్‌కప్ జట్టులో స్థానం సంపాదిస్తాడో వేచి చూడాలి.
కాగా, అశ్విన్ ఆడిన క్లబ్ మ్యాచ్‌లో అతని జట్టే (మైలాపోర్ రీక్రియేషన్ క్లబ్) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైలాపోర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. అశ్విన్ 17 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేశాడు. ఛేదనలో యంగ్ స్టార్స్ జట్టు 257 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా ఆశ్విన్ ప్రాతినిథ్యం వహించిన మైలాపోర్ రీక్రియేషన్ క్లబ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment