అతడు అద్భుతం.. క్రెడిట్‌ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్‌ శర్మ | Asia Cup 2023, Ind Vs Ban: Rohit Lauds Axar, Gill But Credit To Bangladesh Bowlers - Sakshi
Sakshi News home page

Rohit Sharma: నో కాంప్రమైజ్‌.. ఓటమికి కారణం అదే.. ఆ క్రెడిట్‌ వాళ్లదే!

Published Sat, Sep 16 2023 10:36 AM | Last Updated on Sat, Sep 16 2023 3:58 PM

Asia Cup Ind Vs Ban: Rohit Lauds Axar Gill Credit To Bangladesh Bowlers - Sakshi

బంగ్లాదేశ్‌ చేతిలో టీమిండియా ఓటమి (PC: BCCI)

Asia Cup 2023- Ind Vs Ban: Rohit Sharma Comments On Loss: ‘‘భవిష్యత్తు మ్యాచ్‌లు.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరు ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావించాం. అందుకే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మార్పుల విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. వరల్డ్‌కప్‌ ఆడాల్సిన కొంతమంది ఆటగాళ్లను పరీక్షించేందుకు జట్టులోకి తీసుకున్నాం.

అక్షర్‌ పటేల్‌ అద్భుతం
ఈరోజు అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ లక్ష్యం పూర్తి చేయలేకపోయాడు. అయితే, ఆఖరి వరకు అతడు పట్టుదలగా పోరాడిన తీరు అద్భుతం’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(34 బంతుల్లో 42 పరుగులు)ను ప్రశంసించాడు.

బంగ్లాదేశ్‌ చేతిలో భంగపాటు
అదే విధంగా.. బంగ్లాదేశ్‌ విజయంలో ఆ జట్టు బౌలర్లదే కీలక పాత్ర అన్న రోహిత్‌... వారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్‌-2023 ఫైనల్లో బెర్తు ఖరారు చేసుకున్న తర్వాత సూపర్‌-4లో బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.

స్టార్లు లేకుండా బరిలోకి దిగి
ప్రాధాన్యం లేని మ్యాచ్‌ కావడంతో ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా అనూహ్య రీతిలో బంగ్లా చేతిలో ఓడి పరాభవం మూటగట్టుకుంది. విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్లతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్‌ ఇచ్చి.. షకీబ్‌ బృందం చేతిలో భంగపాటుకు గురైంది.

అందుకే వాళ్లకు అవకాశాలు
కాగా బంగ్లాతో మ్యాచ్‌లో హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ(5) వన్డే అరంగేట్రం చేయగా.. సూర్యకుమార్‌ యాదవ్‌(26) కూడా చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా.. మహ్మద్‌ షమీ, శార్దూల్‌ ఠాకూర్‌, ప్రసిద్‌ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. వన్డే వరల్డ్‌కప్‌-2023కు ముందు ఆటగాళ్ల సన్నద్ధతను పరీక్షించేందుకే ఈ మ్యాచ్‌లో వీరికి అవకాశం ఇచ్చినట్లు తెలిపాడు.

రాజీపడేది లేదు
ఆటలో గెలుపోటములు సహజమని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం పట్ల పశ్చాత్తాపం లేదని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో శతకం(121)తో ఆకట్టుకున్న శుబ్‌మన్‌ గిల్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గిల్‌ అద్బుతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

గిల్‌ ఫామ్‌లో ఉన్నాడు.. సెంచరీతో
అతడి నుంచి మేము ఏం కోరుకుంటున్నామో అదే చేసి చూపించాడు.  జట్టు కోసం ఏమేం చేయాలో అంతా చేశాడు. గతేడాది కాలంగా గిల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కొత్త బంతితో బౌలర్లు అటాక్‌ చేసినపుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. హార్డ్‌వర్క్‌తో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటున్నాడు’’ అని రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ డకౌట్‌ అయ్యాడు.

భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ స్కోర్లు:
టాస్‌: టీమిండియా.. బౌలింగ్‌
బంగ్లా స్కోరు: 265/8 (50)
టీమిండియా స్కోరు: 259 (49.5) 
విజేత: 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షకీబ్‌ అల్‌ హసన్‌(80 పరుగులు సహా.. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌).

చదవండి: క్లాసెన్‌ మహోగ్రరూపం.. క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement