అడిలైడ్‌లో మంగళవారం కోహ్లి ప్రాక్టీస్
రెండేళ్ల క్రితం భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటించినప్పుడే ఇదే అడిలైడ్ మైదానంలో తొలి టెస్టును ‘డే అండ్ నైట్’గా ఆడదామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) చేసిన ప్రతిపాదనను బీసీసీఐ మరో మాటకు తావు లేకుండా తిరస్కరించింది. అప్పటికే ఆస్ట్రేలియాకు నాలుగు ‘పింక్ బాల్’ టెస్టులు ఆడిన అనుభవం ఉండగా... భారత్ ఒక్క ‘పింక్’ మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో తమ సిరీస్ గెలుపు అవకాశాలు దెబ్బ తింటాయని భారత బోర్డు భావించింది. ఇప్పుడు కూడా దాదాపు పరిస్థితి అలాగే ఉంది. ఓవరాల్‌గా ఆసీస్ జట్టు 7 డే–నైట్ టెస్టులు స్వదేశంలోనే ఆడి అన్నీ గెలవగా... భారత్ తమ ఒకే ఒక మ్యాచ్‌ను సొంతగడ్డపై బలహీనమైన బంగ్లాదేశ్‌తో ఆడి మమ అనిపించుకుంది. ఈసారి మాత్రం డే–నైట్ సవాల్‌కు టీమిండియా ‘సై’ అంది. అయితే తొలి టెస్టులో భారత జట్టుకు ఎదురు కానున్న సవాళ్లు ఏమిటి... నిజంగానే పింక్ బంతితో టెస్టు ఆడటం అంత కష్టమా!
సాక్షి క్రీడా విభాగం: 2015లో నవంబర్ 27–డిసెంబర్ 1 మధ్య ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లోనే తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగింది. ఆ తర్వాత ఇదే వేదికపై ఆ్రస్టేలియా జట్టు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్‌లను ఓడించింది. మరో రెండు టెస్టులు బ్రిస్బేన్‌లో, ఒక టెస్టు పెర్త్‌లో ఆడిన ఆ్రస్టేలియా అవి కూడా గెలిచి తమ ‘పింక్ బాల్’ రికార్డును 7–0గా మెరుగుపర్చుకుంది. సరిగ్గా ఏడాది క్రితం కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో భారత్ తమ ఏకైక టెస్టు ఆడి ఇన్నింగ్స్ విజయం అందుకుంది. ఇప్పుడు మరోసారి తమకు అచ్చొచ్చిన వేదిక అడిలైడ్‌లో ఆ్రస్టేలియా టీమ్ పర్యాటక జట్టు కోసం సిద్ధంగా ఉంది.
బంతి మారింది
భారత జట్టు తమ టెస్టును ‘ఎస్‌జీ’ బంతితో ఆడింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ‘కూకాబుర్రా’ బంతిని వాడతారు. భారత జట్టు గత ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఇదే తరహా బంతిని ఎదుర్కోవడం సానుకూలాంశం. సాధారణ ఎరుపు బంతితో పోలిస్తే కూకాబుర్రా గులాబీ బంతి సాయంత్రం కాగానే భిన్నంగా స్పందిస్తోంది. ఒక్కసారిగా బంతి వేగం పెరిగిపోతోంది. గాల్లో స్వింగ్ కావడంతో పాటు పిచ్‌పై పడిన తర్వాత కూడా ఈ తేడా కనిపిస్తోంది. దీనిని మన బ్యాట్స్‌మన్ గుర్తించి అందుకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. తొలి టెస్టుకు అందుబాటులో లేని డేవిడ్ వార్నర్‌కు డే అండ్ నైట్ టెస్టుల్లో మంచి అనుభవం ఉంది. ‘ట్రిపుల్ సెంచరీ’ సహా గులాబీ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన వార్నర్ చెప్పినట్లుగా... పింక్ బాల్‌ను ఎదుర్కొనే విషయంలో కొంత సమయం ఇబ్బంది పడ్డా దానిని సానుకూలంగా కూడా మార్చుకునేందుకు మంచి అవకాశం ఉంటుంది. దానిని సరిగ్గా అంచనా వేయగలిగితే పరుగుల వరద పారుతుంది.
పేస్ పదును...
ఆ్రస్టేలియాతో పోలిస్తే భారత పేస్ బౌలింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తున్నా ప్రత్యేకంగా డే–నైట్ టెస్టుల అనుభవం విషయంలో ప్రత్యర్థి జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. 7 ‘పింక్’ టెస్టులూ ఆడిన స్టార్క్ 42 వికెట్లు తీస్తే 6 మ్యాచ్‌లలో హాజల్‌వుడ్ 28, కమిన్స్ 4 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ త్రయం భారత బ్యాట్స్‌మెన్ పని పట్టేందుకు సిద్ధంగా ఉంది. అయితే అడిలైడ్‌లో పడిన మొత్తం వికెట్లలో పేస్ బౌలర్లే 101 తీయడం మన జట్టులో కూడా ఆశలు రేపుతోంది. కానీ స్పిన్ విభాగంలో మాత్రం ఆ్రస్టేలియా బౌలర్ నాథన్ లయన్ మినహా విదేశీ స్పిన్నర్లు ఎవ్వరూ కూడా ఇక్కడ రాణించలేదు. లయన్ ఒక్కడే 18 వికెట్లు తీయగా... ఇతర బౌలర్లెవరూ రెండు వికెట్లకు మించి తీయలేదు. కాబట్టి లయన్ నుంచి కూడా భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. టీమిండియా తుది జట్టులో అశ్విన్, కుల్దీప్‌లలో ఎవరికి చోటిస్తుందో చెప్పలేం.
విదేశీ జట్ల పేలవ ప్రదర్శన
రికార్డు చూస్తే ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి ఇబ్బంది పెట్టలేకపోయింది. కంగారూలు రెండు మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా, ఒక మ్యాచ్‌లో 296 పరుగులతో నెగ్గారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్‌కు 30 పరుగులకు మించి లేదు. ఒకసారి దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్‌లలోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే–నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్‌లో శుభారంభం చేయాల్సి ఉంది.
ఆ 40–50 నిమిషాలే కీలకం!
సహజ వెలుతురు నుంచి లైట్ల వెలుగులోకి... వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోవడం... గాలి వేగంలో మార్పు... పూర్తిగా చీకటి కమ్ముకోవడానికి కాస్త ముందు సూర్యాస్తమయ సమయంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. పింక్ టెస్టులో ఇదే సమయం కీలకంగా మారిపోతోంది. రెండో సెషన్ చివర్లో కొద్దిసేపు, మూడో సెషన్ ఆరంభంలో మరికొంత సేపు ఉండే ఈ సమయంలోనే బ్యాట్స్‌మన్ ఏకాగ్రత చెదరడం, ప్రత్యర్థి జట్టు వికెట్ల వేటలో పడటం కనిపిస్తున్నాయి. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా సరిగ్గా ఇదే మాట చెప్పాడు. ‘ఆ 40–50 నిమిషాల సమయంలోనే ఎంతో ఓపిక అవసరం. అప్పుడు బాగా ఆడగలిగితే ఆ తర్వాత తిరుగుండదు. కాబట్టి కొత్త ఆటగాడు వచ్చి ఇబ్బంది పడటంకంటే అప్పటికే క్రీజ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పట్టుదల కనబరిస్తే మంచిది’ అని రహానే అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment