మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్, నిరుటి రన్నరప్ మెద్వెదెవ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల ఈవెంట్లో సిమోనా హలెప్ (రొమేనియా), అరిన సబలెంక (బెలారస్), ఇగా స్వియటెక్ (పోలండ్)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ మెద్వెదెవ్ 6–4, 6–4, 6–2తో వరుస సెట్లలో వాన్ డి జండ్‌షల్ప్ (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్... గంటా 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ 7–5, 7–6 (7/3), 3–6, 6–3తో ఐదో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు.
మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–5, 6–7 (2/7), 6–4తో బెనాయిట్ పైర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియసిమ్ (కెనడా) 6–4, 6–1, 6–1తో డానియెల్ ఇవాన్స్ (ఇంగ్లండ్)పై, 11వ సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 1–6, 3–6, 6–1తో తరో డానియెల్ (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 4–6, 6–3, 6–1తో మర్కెటా వొండ్రోసొవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–3తో డారియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 14వ సీడ్ హలెప్ 6–2, 6–1తో డంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment