స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల తర్వాత ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా టాపార్డర్ బ్యాటర్లంతా (హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8), షాంటో (9), మొమినుల్ హక్ (5)) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. ముష్ఫికర్ రహీం (35), షాదత్ హొసేన్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసి జట్టును ఆదుకున్నారు. మెహిది హసన్ మీరజ్ (9 నాటౌట్), నురుల్ హసన్ (0 నాటౌట్) బంగ్లాను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా..
బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్ పెవిలియన్‌కు చేరాడు. హ్యాండిల్ ద బాల్ నిబంధన మేరకు రహీం ఔటైనట్లు అంపైర్లు ప్రకటించారు. జేమీసన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రహాం బంతిని డిఫెన్స్ ఆడగా అది కాస్త వికెట్లను ముద్దాడే దిశగా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన రహీం బంతి వికెట్లు తాకకుండా అడ్డుకున్నాడు. టెస్ట్‌ల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రహీం రికార్డుల్లోకెక్కాడు.
Mushfiqur Rahim becomes the first Bangladesh player to be dismissed for handling the ball.pic.twitter.com/cMdWVcNpNt
— CricTracker (@Cricketracker) December 6, 2023
టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా ఈ నిబంధన ద్వారా ఇప్పటివరకు 11 మంది ఔటయ్యారు. రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రహీంకు ముందు మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, మర్వన్ ఆటపట్టు, స్టీవ్ వా, గ్రహం గూచ్, డెస్మండ్ హేన్స్, మొహిసిన్ ఖాన్, ఆండ్రూ హిల్డిచ్, రసెల్ ఎండీన్, లియోనార్డ్ హట్టన్ హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఓటమిపాలై సిరీస్‌లో వెనుకపడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment