‘ఎ’ ప్లస్‌లోనే ఆ ముగ్గురు.. ఏడాదికి రూ.7 కోట్లు! | BCCI announces Team India annual player contracts | Sakshi
Sakshi News home page

‘ఎ’ ప్లస్‌లోనే కోహ్లి, రోహిత్, బుమ్రా..

Published Fri, Apr 16 2021 5:09 AM | Last Updated on Fri, Apr 16 2021 12:09 PM

BCCI announces Team India annual player contracts - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్‌కు కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 2019–2020 కాంట్రాక్ట్‌ గతేడాది సెప్టెంబరు 30తో ముగియగా... తాజా కాంట్రాక్ట్‌ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు ఉంటుంది. ఈసారి మొత్తం 28 మంది ఆటగాళ్లతో బీసీసీఐ కాంట్రాక్ట్‌ జాబితాను రూపొందించింది. వరుసగా మూడో ఏడాది భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు.

హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్, పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలిసారి కాంట్రాక్ట్‌లను అందుకున్నారు. వీరిద్దరికి గ్రేడ్‌ ‘సి’ లో చోటు కల్పించారు. వీరిద్దరికి రూ. కోటి చొప్పు న కాంట్రాక్ట్‌ మొత్తం లభిస్తుంది. 2017–2018 తర్వాత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (గుజరాత్‌) మళ్లీ కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు సంపాదించాడు. అక్షర్‌ పటేల్‌కు గ్రేడ్‌ ‘సి’లో స్థానం ఇచ్చారు. గాయాల బారిన పడ్డ భువనేశ్వర్‌ కుమార్‌ గ్రేడ్‌ ‘ఎ’ నుంచి ‘బి’కి  పడిపోయాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు గ్రేడ్‌ ‘బి’ నుంచి ‘ఎ’కు... పేస్‌ బౌలర్‌ శార్దుల్‌ ఠాకూర్‌కు గ్రేడ్‌ ‘సి’ నుంచి ‘బి’కి ప్రమోషన్‌ లభించింది. గత ఏడాది గ్రేడ్‌ ‘సి’ కాంట్రాక్ట్‌ పొందిన కేదార్‌ జాదవ్‌ (మహారాష్ట్ర), మనీశ్‌ పాండే (కర్ణాటక) ఈసారి మొండిచేయి లభించింది. వీరిద్దరూ తమ కాంట్రాక్ట్‌లను కోల్పోయారు.  

కుల్దీప్‌ యాదవ్‌ ‘ఎ’ నుంచి ‘సి’కి...
గ్రేడ్‌ ‘ఎ’లో 10 మందికి చోటు కల్పించారు. గత ఏడాది గ్రేడ్‌ ‘ఎ’లో ఉన్న ‘చైనామన్‌’ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గ్రేడ్‌ ‘సి’కి... గ్రేడ్‌ ‘బి’లో ఉన్న యజువేంద్ర చహల్‌ గ్రేడ్‌ ‘సి’కి  పడిపోయారు. 2019 ప్రపంచకప్‌ తర్వాత వీరిద్దరు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. వరల్డ్‌కప్‌ తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ కేవలం మూడు టి20 మ్యాచ్‌లు ఆడగా... చహల్‌ 17 మ్యాచ్‌లు ఆడి కేవలం 16 వికెట్లు తీశాడు. టెస్టు ఫార్మాట్‌లోనూ కుల్దీప్‌ యాదవ్‌పై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అంతగా నమ్మకం పెట్టుకోలేదు. 2018–2019 ఆస్ట్రేలియా పర్యటనలో హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి నుంచి భారత నంబర్‌వన్‌ స్పిన్నర్‌ అంటూ కితాబు అందుకున్న కుల్దీప్‌ యాదవ్‌కు ఆ తర్వాత కేవలం ఒకే ఒక్క టెస్టులో ఆడాడు.  

కొత్త కాంట్రాక్ట్‌ జాబితా
గ్రేడ్‌ ‘ఎ’ ప్లస్‌ (రూ. 7 కోట్లు)
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా.
గ్రేడ్‌ ‘ఎ’ (రూ. 5 కోట్లు)
రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా,
చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, మొహమ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా.
గ్రేడ్‌ ‘బి’ (రూ. 3 కోట్లు)
వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్, భువనేశ్వర్‌ కుమార్, శార్దుల్‌ ఠాకూర్, మయాంక్‌ అగర్వాల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement