అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు: పాక్‌ ఆటగాడిపై విమర్శలు | Best Example Of Nepotism: Pakistan Azam Khan Roasted For Poor Show Ahead T20 WC | Sakshi
Sakshi News home page

T20 WC: అంతర్జాతీయ క్రికెట్‌కే సిగ్గుచేటు.. పాక్‌ ఆటగాడిపై తీవ్ర విమర్శలు

Published Fri, May 31 2024 4:55 PM | Last Updated on Fri, May 31 2024 5:16 PM

Best Example Of Nepotism: Pakistan Azam Khan Roasted For Poor Show Ahead T20 WC

పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. సొంత జట్టు అభిమానులే అతడి ఆట తీరుపై మండిపడుతున్నారు. బంధుప్రీతితో ఇలాంటి వాళ్లను జట్టుకు ఎంపిక చేస్తే మున్ముందు భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెగా టోర్నీకి సన్నద్దమయ్యే క్రమంలో బట్లర్‌ బృందంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది.

తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 23 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మూడో టీ20 రద్దైపోగా.. గురువారం నాటి ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

పూర్తిగా విఫలం
ఇదిలా ఉంటే.. తాజా సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ పాక్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. రెండో టీ20లో 10 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు చేసిన మిడిలార్డర్‌ బ్యాటర్‌.. నాలుగో టీ20లో డకౌట్‌ అయ్యాడు.

ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఐదు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టి పెవిలియన్‌ చేరాడు. కాగా 2021లో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 25 ఏళ్ల ఆజం ఖాన్‌.. ఇప్పటిదాకా పాక్‌ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 135.38.

అయితే, వరల్డ్‌కప్‌-2024 జట్టులో మాత్రం అనూహ్యంగా అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనైనా రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని భావిస్తే.. ఆజం ఖాన్‌ పూర్తిగా విఫలం కావడం అభిమానులను సైతం నిరాశపరిచింది.

ఆజం ఖాన్‌ జట్టుకు ‘భారమే’ అంటూ ట్రోల్స్‌
ఇక ఈ సిరీస్‌లో పాకిస్తాన్‌ చిత్తుగా ఓడటంతో అందరి దృష్టి ఆజం ఖాన్‌పై పడింది. వికెట్‌ కీపర్‌గానూ అతడు విఫలం కావడంతో.. ఆజం ఖాన్‌ జట్టుకు ‘భారమే’ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆజం ఖాన్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్‌ జరుగుతోంది. అతడి ఆట తీరుకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేస్తూ.. ‘‘నెపోటిజం అన్న పదానికి అత్యుత్తమ ఉదాహరణగా ఇతడిని చూపవచ్చు.

అతడు జట్టులో ఉండాలని కోరుకున్న వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలి. ఇదేదో చిన్న పొరపాటు కాదు.. తీవ్రంగా పరిగణించదగ్గ నేరం. అంతర్జాతీయ క్రికెట్‌కే ఒక రకంగా సిగ్గుచేటు’’ అని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు నెటిజన్లు. కాగా పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ తనయుడే ఈ ఆజం ఖాన్‌!!

చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్‌, సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement