BGT 2023: Rohit Sharma Became 4th Captain To Score Centuries in 3 Formats - Sakshi
Sakshi News home page

IND VS AUS 1st Test: భారత క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు

Published Fri, Feb 10 2023 1:38 PM | Last Updated on Fri, Feb 10 2023 3:33 PM

BGT 2023: Rohit Sharma Became 4th Captain To Score Centuries In 3 Formats - Sakshi

Rohit Sharma: భారత క్రికెట్‌ చరిత్రలో ఏ కెప్టెన్‌కూ సాధ్యంకాని ఓ అత్యంత అరుదైన రికార్డును టీమిండియా సారధి రోహిత్‌ శర్మ నెలకొల్పాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు ఆటలో సెంచరీ సాధించడం ద్వారా హిట్‌మ్యాన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ముగ్గురి పేరిట ఉండేది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్‌ తిలకరత్నే దిల్షాన్‌ ఈ ఘనత సాధించగా.. ఆతర్వాత సౌతాఫ్రికా మాజీ సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, ఇటీవలే పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. తాజాగా రోహిత్‌ ఈ దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు.

రోహిత్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్ట్‌ జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌ సాధించిన తొలి సెంచరీ ఇదే. తాజా సెంచరీతో హిట్‌మ్యాన్‌ భారత దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోని, కోహ్లిలకు సాధ్యంకాని అత్యంత అరుదైన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

టెస్ట్‌ల్లో రెండేళ్ల తర్వాత సెంచరీ చేసిన రోహిత్‌ కెరీర్‌లో 9వ టెస్ట్‌ శతకాన్ని నమోదు చేశాడు. ఈ సెంచరీ చేసేందుకు 171 బంతులు ఆడిన రోహిత్‌ 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌ 43వ శతకాన్ని పూర్తి చేశాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఇన్నింగ్సే హైలైట్‌ అని చెప్పాలి. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌ ఓ పక్క వికెట్లు పేకమేడలా కూలుతున్నా.. మొక్కవోని మనోధైర్యంతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేశాడు. సహచరులు పుజారా (7), కోహ్లి (12), సూర్యకుమార్‌ యాదవ్‌ (8) ఆసీస్‌ స్పిన్నర్ల దెబ్బకు బెంబేలెత్తిపోయినా రోహిత్‌ మాత్రం వారిపై ఎదురుదాడి​కి దిగి సెంచరీ తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను (181 బంతుల్లో 105; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) కొనసాగిస్తున్నాడు. హిట్‌మ్యాన్‌కు జతగా జడేజా (22) క్రీజ్‌లో ఉన్నాడు. 71 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 201/5గా ఉంది. ప్రస్తుతానికి టీమిండియా 24 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/42) ఆసీస్‌ పతనాన్ని శాసించారు. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్‌ స్మిత్‌ (37), హ్యాండ్స్‌కోంబ్ (31), అలెక్స్‌ క్యారీ (‌36)లకు మంచి ఆరంభాలే లభించిన వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమయ్యారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement