కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గయనా అమెజాన్ వారియర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. సెయింట్ లూసియా కింగ్స్.. వారియర్స్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. భారతకాలమానం ప్రకారం వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) ఉదయం జరిగిన మ్యాచ్‌లో లూసియా కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక వికెట్‌కీపర్ భానుక రాజపక్స (49 బంతుల్లో 86; 9 ఫోర్లు, 5 సిక్సర్లు).. కొలిన్ మున్రో (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో లూసియా కింగ్స్‌ను గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పాక్ ఆటగాడు ఆజమ్ ఖాన్ (25 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాయ్ హోప్ (35 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సైమ్ అయూబ్ 16, మాథ్యూ నందు 3, హెట్‌మైర్ 19 నాటౌట్, రొమారియో షెపర్డ్ 10 నాటౌట్, కీమో పాల్ 19 పరుగులు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫోర్డ్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకన్నారు. మాథ్యూ నందు రనౌటయ్యాడు.
అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. రాజపక్స (86), మున్రో (55) రాణించడంతో 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (1) విఫలం కాగా.. సీన్ విలియమ్స్ (8), సికందర్ రజా (12) అజేయంగా నిలిచారు. అమెజాన్ వారియర్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, కీమో పాల్, కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ గెలుపుతో లూసియా కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. గయానా వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment