PC: IPL Twitter
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. షార్ట్‌కట్‌లో ఆర్‌సీబీ. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ ఫాలోవర్స్ కలిగిన జట్టుగా ఆర్సీబీ ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. సీఎస్కే, ముంబై జట్లు టైటిళ్లు కొల్లగొట్టడంతో ఫ్యాన్‌బేస్‌ను పెంచుకోగా.. ఆర్‌సీబీ మాత్రం మొదటి సీజన్ నుంచి తాజా సీజన్ వరకు ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా అభిమాన గణం మాత్రం పెంచుకుంటూనే వచ్చింది. అయితే ఆ జట్టు మాత్రం అభిమానుల ఆశలను నిలుపుకోలేక దురదృష్టవంతమైన టీమ్‌గా తయారైంది.
PC: IPL Twitter
మొదటి సీజన్ నుంచి చూసుకుంటే కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లు మారినా ఆర్‌సీబీ తలరాత మాత్రం మారడం లేదు. ప్రతీసారి అంచనాలకు మించి పేపర్ బలంగా కనిపించే జట్టు ఆర్సీబీ. ''ఈసాలా కప్ నమ్‌దే'' అంటూ ట్యాగ్‌లైన్ ఏర్పాటు చేసుకొని ఆర్‌సీబీ బరిలోకి దిగుతుంటే.. అరె ఈసారి ఎలాగైనా కప్ కొడుతుంది అని అభిమానులు మురిసిపోవడం.. మొదట్లో మెరిసి ఆఖర్లో ఊసురుమనిపించడం అలవాటుగా చేసుకుంది. ఆర్సీబీకి అంత పేరు రావడానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉండడమే. ఆరంభం నుంచి కోహ్లి ఆర్‌సీబీలోనే ఉండడం.. 2014లో ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లి.. 2021 ఐపీఎల్ సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. తన ఏడేళ్ల కెప్టెన్సీలో ఆర్‌సీబీని కోహ్లి ఒకసారి రన్నరప్(2016), మూడుసార్లు ప్లేఆఫ్ వరకు తీసుకెళ్లగలిగాడు.
ఇక 2022 ఐపీఎల్‌లో డుప్లెసిస్ కెప్టెన్సీలోని ఆర్‌సీబీ ఆరు సీజన్ల తర్వాత ఎలిమినేటర్ గండాన్ని దాటింది. అయితే క్వాలిఫైయర్ సరిహద్దును మాత్రం దాటలేకపోయింది. 8వ సారి ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్‌సీబీ.. ఎనిమిదో సారి కూడా రిక్త హస్తాలతోనే ఇంటిబాట పట్టింది. దీంతో ఆర్‌సీబీని మరో దక్షిణాఫ్రికా జట్టుతో పోలుస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇది ఎంతవరకు నిజం అని చెప్పలేం గాని.. కొన్ని విషయాల్లో మాత్రం ఆర్‌సీబీ ప్రొటిస్ జట్టును గుర్తుకుతెస్తుంది.
PC: IPL Twitter
క్రికెట్‌లో అత్యంత దురదృష్టవంతమైన జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. ఇంతవరకు ఒక్క మేజర్ టోర్నీని(ఐసీసీ ట్రోఫీలు) గెలవని ప్రొటీస్ జట్టు పరంగా చూస్తూ మాత్రం ఎప్పుడు ఉన్నతస్థానంలోనే ఉంటుంది. 1990వ దశకం నుంచి 2017 వరకు దక్షిణాఫ్రికా జట్టు పేపర్‌పై చాలా బలంగా కనిపించేది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చెలరేగిపోయే దక్షిణాఫ్రికా.. ఐసీసీ మేజర్ టోర్నీలంటే మాత్రం ఎక్కడలేని ఒత్తిడిని కొనితెచ్చుకునేది. ఆ ఒత్తిడితోనే గెలవాల్సిన మేజర్ ట్రోఫీలను కూడా చేజేతులా పోగొట్టుకునేది. ప్రొటీస్ జట్టలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువలేదు. జట్టుకు ఆడిన దిగ్గజ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా 1999 వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లో 1 బంతికి 22 పరుగులు చేయాల్సి రావడం.. బహుశా దక్షిణాఫ్రికా జట్టుకు మాత్రమే చెల్లింది.
అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా ఉన్న ప్రొటిస్ జట్టుకు, ఆర్‌సీబీకి కొన్ని విషయాల్లో మాత్రం చాలా పోలికలు ఉన్నాయి. ఆర్‌సీబీ కూడా ప్రతీసారి భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువ లేకపోవడం.. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని కొనితెచ్చుకోవడం.. ఫలితంగా టైటిల్‌కు దూరంగా నిలవడం జరుగుతూనే ఉంది. ఆర్‌సీబీ కప్ కొట్టేది ఎప్పుడు.. తమ ఒత్తిడిని జయించేది ఎన్నడూ.. ఐపీఎల్ టైటిల్ కొట్టాలన్న నిరీక్షణ ఫలించేది ఎన్నడనేది వేచి చూడాల్సిందే.
చదవండి: Trolls On RCB Fan Girl: 'ఆర్‌సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు'
కోహ్లి కెరీర్ మొత్తం కంటే ఈ సీజన్‌లోనే ఎక్కువ తప్పులు చేశాడు.. మరీ ఇలా
Comments
Please login to add a commentAdd a comment