ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫిపా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ తమ ప్రయాణాన్ని క్వార్టర్ ఫైనల్లోనే ముగించింది. క్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ క్రోయేషియా చేతిలో పరాజయం పాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో ఆరోసారి ట్రోఫీను ముద్దాడాలని ఖాతర్ గడ్డపై అడుగుపెట్టిన సాంబా బృందం నిరాశతో ఇంటిముఖం పట్టింది. తమ ఆరాధ్య జట్టు ఓడిపోవడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. బ్రెజిల్ జట్టు స్టార్ ఆటగాడు నెయ్‌మర్ సైతం పొగిలి పొగిలి ఏడ్చాడు.
మ్యాచ్ సాగిందిలా..
ఇరు జట్లు మ్యాచ్ నిర్దేశిత 90 నిమిషాల సమయం ముగిసే వరకు గోల్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు అదనపు సమయమిచ్చారు. అయితే అదనపు సమయంలో మొదటి అర్ధ భాగంలో నెయ్‌మర్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో మెరిశాడు. అభిమానులలో గెలుపు ఆశలు రేకెత్తించాడు.
పట్టలేని సంతోషం తో మైదానంలో పరుగులు తీసాడు. దీంతో 1-0 బ్రెజిల్‌కు లభించింది. అనంతరం రెండో అర్ధభాగం లో క్రొయేషియా ఆటగాడు బ్రూనో పెట్వోనిక్ గోల్ చేసి స్కోర్లను 1-1 తేడాతో సమం చేశాడు. దీంతో అభిమానుల హృదయ స్పందనల వేగం మరింత హెచ్చింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు మ్యాచ్ రిఫరీ పెనాల్టీ షూటౌట్‌ను ఎంచుకున్నారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫెనాల్టీ షూటౌట్‌లో ఏం జరిగిందంటే?
తొలి ప్రయత్నంలోనే క్రోయేషియా ఆటగాడు గోల్ కొట్టి తమ జట్టుకు అధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం బ్రెజిల్ తమ తొలి ప్రయత్నంలో గోల్ కొట్టడంలో విఫలమైంది. బ్రెజిల్ ఆటగాడు రోడ్రిగో కొట్టిన బంతిని క్రోయేషియా గోల్ కీపర్ లీవర్ కోచ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక రెండో ప్రయత్నంలోనూ క్రొయేషియా ఆటగాడు బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించగా.. బ్రెజిల్ కూడా ఈ సారి గోల్ కొట్టడంలో సఫలమైంది.
దీంతో స్కోర్ 2-1గా మారింది. ఇక మూడో ప్రయత్నంలోనూ క్రొయేషియా, బ్రెజిల్ ఇరు జట్లు గోల్స్ సాధించాయి. దీంతో స్కోర్ 3-2 అయింది. ఇక నాలుగో ప్రయత్నంలోనూ క్రొయేషియా గోల్ సాధించింది. దీంతో 4-2గా మారింది. స్టేడియం మొత్తం ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో బ్రెజిల్ తరపున గోల్ కొట్టేందుకు మార్కినోస్ పెనాల్టీ తీసుకున్నాడు.
అయితే మార్కినో కొట్టిన షాట్ ఎడమైవైపున్న గోల్ బార్‌ను తాకడంతో బ్రెజిల్ ఓటమిపాలైంది. దీంతో సగటు బ్రెజిల్ అభిమాని గుండె పగిలింది. ఇక బ్రెజిల్‌పై అద్భుత విజయం సాధించిన క్రోయేషియా సెమీఫైనల్లో అడుగు పెట్టింది.
ఏదేమైనా ఆటలో గెలుపుఓటములు సహజమే!
క్రొయేషియా గెలిచినా.. బ్రెజిల్ ఓడినా సాకర్ ప్రేమికులను ఈ మ్యాచ్ ఉత్కంఠతో మునివేళ్ళమీద నిలబెట్టిందనటంలో సందేహం లేదు. కావాల్సినంత వినోదం పంచడంతో పాటు కాసిన్ని భావోద్వేగాలను కూడా మూటగట్టింది.
చదవండి: FIFA WC: షూటౌట్‌లో బ్రెజిల్ అవుట్.. సెమీఫైనల్లో క్రోయేషియా
Comments
Please login to add a commentAdd a comment