టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సొంత మైదానం అయిన న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (అక్టోబర్ 11) భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ఐపీఎల్ 2023లో విరాట్-నవీన్‌ల మధ్య గొడవ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఏమేరకు రియాక్ట్ అవుతారోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. విరాట్ సొంత మైదానం కావడంతో ప్రేక్షకులు నవీన్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించవచ్చేమో అని జనాలు అనుకుంటున్నారు. నవీన్ ఉల్ హక్ పేరు ప్రస్తుతం సోషల్‌మీడియాలో సైతం ట్రెండింగ్‌లో ఉంది. మరి ఢిల్లీ ప్రేక్షకులు నవీన్ పట్ల ఏరకంగా వ్యవహరిస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హక్ మధ్య 2023 ఐపీఎల్ సందర్భంగా గొడవ జరిగిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవ చినికిచినికి గాలివానలా మారి, నవీన్ ఎక్కడికి వెళ్లినా నీడలా వెంటాడుతుంది. ఈ గొడవకు కారకులెవరు అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా నవీన్ ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా కోహ్లి అభిమానులు అతని టార్గెట్ చేస్తున్నారు.
నవీన్ కనిపిస్తే చాలు కోహ్లి, కోహ్లి అంటూ కేకలు పెడుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కోహ్లి అభిమానుల టార్చర్ తట్టుకోలేక నవీన్ తన సోషల్‌మీడియా ఖాతాల కామెంట్ల సెక్షన్‌ను డిసేబుల్ చేశాడు. కోహ్లి ఫ్యాన్స్ నవీన్‌ను నిద్రలో కూడా వెంటాడుతున్నారు. కోహ్లి ఫ్యాన్స్ దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నవీన్‌కు వరల్డ్‌కప్ జట్టులో చోటివ్వదని అంతా అనుకున్నారు. అయినా ఆ దేశ బోర్డు సాహసం చేసి నవీన్‌ను ఇండియాకు పంపింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించగా.. ఆఫ్ఘన్లు తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment