బంగ్లాదేశ్ వెటరన్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగబోయే మ్యాచ్‌కు ముందు అతను స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ కోహ్లి ఆన్ ఫీల్డ్ మనస్తత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఈ సందర్భంగా స్లెడ్జింగ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ముష్ఫికర్ మాట్లాడుతూ.. సాధారణంగా కోహ్లి బ్యాటింగ్ చేసేప్పుడు చాలా నెమ్మదిగా ఉంటాడని, పొరపాటున అతన్ని ఎవరైనా స్లెడ్జ్ చేస్తే అతనిలోని అత్యుత్తమ ప్రదర్శన బయటివచ్చి ఉగ్రుడిలా మారిపోతాడని అన్నాడు.
అందుకే నేనెప్పుడూ కోహ్లిని స్లెడ్జ్ చేసే సాహసం చేయనని.. మా బౌలర్లకు కూడా ఇదే చెబుతానని తెలిపాడు. సహజంగానే కోహ్లి ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోవాలని అనుకోడని, స్లెడ్జింగ్ చేస్తే అతను మరింత రెచ్చిపోయి, అదనపు సంకల్పంతో బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ ఆటగాడినైనా స్లెడ్జింగ్ చేసి తమకనుకూలంగా ఫలితం రాబట్టవచ్చు కానీ, కోహ్లి ముందు ఆ పప్పులు ఉడకవని అన్నాడు.
36 ఏళ్ల ముష్ఫికర్ రహీం తన 17 ఏళ్ల కెరీర్‌లో కోహ్లిని చాలా దగ్గరగా చూశాడు. కోహ్లితో అతనికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో రహీం.. కోహ్లికి సంబంధించి తన అనుభవాలను పంచుకున్నాడు.
ఇదిలా ఉంటే, పూణే వేదికగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. టీమిండియాను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్) జయభేరి మోగించిన భారత్.. ఇవాల్టి మ్యాచ్‌లోనూ గెలుపుపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు (ఆఫ్ఘనిస్తాన్), రెండు పరాజయాలతో (ఇంగ్లండ్, న్యూజిలాండ్) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. భారత్.. న్యూజిలాండ్ తర్వాత రెండో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment