సెంచరీ కోసం స్వార్ధం.. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముంది..? | CWC 2023, IND vs BAN: What Is Wrong In What Virat Did? Says Kris Srikkanth | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS BAN: సెంచరీ కోసం స్వార్ధం.. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముంది..?

Published Fri, Oct 20 2023 11:51 AM | Last Updated on Fri, Oct 20 2023 12:00 PM

CWC 2023 IND VS BAN: What Is Wrong In What Virat Did, Srikkanth On Kohli Getting Trolled Despite Smashing Ton - Sakshi

బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతమైన సెంచరీ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ​కోహ్లి సెంచరీ చేసినప్పటికీ విమర్శలను ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి సెంచరీ మార్కును చేరుకునే క్రమంలో స్ట్రయిక్‌ రొటేట్‌ చేయకుండా స్వార్ధంగా ఆడాడని, కోహ్లి సెంచరీకి అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో కూడా సహకరించాడని (వైడ్‌ ఇ‍వ్వకుండా) కొందరు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ విషయంలో కోహ్లికి టీమిండియా మాజీ ఓపెనర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ బాసటగా నిలిచాడు. కోహ్లి చేసిన దాంట్లో తప్పేముందని కోహ్లిని ట్రోల్‌ చేస్తున్న వారిని ప్రశ్నించాడు. క్రికెట్‌ పరిజ్ఞానం లేని వాళ్లే ఈ విషయంలో కోహ్లిని నిందిస్తారని అన్నాడు. మామూలుగా సెంచరీ చేయడమంటేనే విశేషం. అలాంటిది వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలో, అందులోనూ ఛేదనలో మూడంకెల స్కోర్‌ను చేరుకోవడమంటే మామూలు విషయం కాదు.

అలాంటప్పుడు కోహ్లి చేసింది తప్పెలా అవుతుందని నిలదీశాడు. వాస్తవానికి కోహ్లి సాధించిన దాని గురించి పొగడాల్సింది పోయి, విమర్శలు చేయడమేంటని ప్రశ్నించాడు. ఛేదనలో ఒత్తిడికి లోనుకాకుండా, సహనం కోల్పోకుండా చివరివరకు బ్యాటింగ్‌ చేసినప్పుడు సెంచరీ మార్కును చేరాలనుకోవడంలో తప్పేమీ లేదని అన్నాడు. కోహ్లి ఈ సెంచరీకి వందకు వంద శాతం అర్హుడని పేర్కొన్నాడు. ప్రస్తుతం కోహ్లి స్వార్ధపరుడని విమర్శిస్తున్న జనాలు.. కొన్ని మ్యాచ్‌ల పాటు అతను సెంచరీ చేయకపోతే దుమ్మెత్తిపోయరా అని ప్రశ్నించాడు. 

ఇక అంపైర్‌ వైడ్‌ ఇవ్వడం, ఇవ్వకపోవడం (కోహ్లి 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు) అనేది అతని పరిధిలోని అంశమని, దీనికి కోహ్లి సెంచరీని ముడిపెట్టడం సమంజసం కాదని ట్విటర్‌ వేదికగా కోహ్లిని విమర్శిస్తున్న వారికి చురకలు పెట్టాడు. 

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్‌ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement