వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపుతో పాక్, ఆఫ్ఘనిస్తాన్‌లు సెమీస్ ఆశలు వదులుకున్నాయి. ఈ గెలుపుతో పాయింట్లతో పాటు రన్‌రేట్‌ను సైతం భారీగా మెరుగుపర్చుకున్న కివీస్.. పాక్, ఆఫ్ఘన్లు తమ తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా సెమీస్‌కు చేరే అవకాశాలు లేకుండా చేసింది. ఏదో అద్భుతాలు జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్‌కు చేరలేవు.
కివీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు.. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే అతను ఔటయ్యాక ఏ ఒక్క లంక బ్యాటర్ కూడా రాణించకపోవడంతో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో తీక్షణ (38 నాటౌట్), మధుషంక (19) పోరాడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ట్రెంట్ బౌల్ట్ (10-3-37-3) లంక బ్యాటర్లను గడగడలాడించగా.. రచిన్ రవీంద్ర (2/21), ఫెర్గూసన్ (2/35), సాంట్నర్ (2/22) సత్తా చాటారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు కాన్వే (45), రచిన్ (42) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరితో పాటు డారిల్ మిచెల్ (43) కూడా రాణించడంతో కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.
మా వాళ్లు అద్భుతంగా ఆడారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాలుగా ఉండింది. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబడ్డాం. ఛేదనలో పిచ్ బాగా నెమ్మదించింది. మా బ్యాటర్లు కృత నిశ్చయం కలిగి బ్యాటింగ్ చేశారు. వరుణుడు అడ్డుతగులుతాడేమోనని భయపడ్డాం. పరుగులు అంత ఈజీగా రాలేదు. ఓవరాల్‌గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన.
బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లు అద్భుతం. ప్రత్యర్ధిని త్వరగా ఆలౌట్ చేసి గెలుపుకు మంచి పునాది వేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగినందుకు సంతోషంగా ఉంది. పెరీరా మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం. అలాంటి ఆటగాళ్లు నిమిషాల వ్యవధిలో ఫలితాన్ని మార్చేయగలరు. అయితే మా బౌలర్లు అతన్ని త్వరగా సాగనంపి మ్యాచ్‌పై పట్టు సాధించేలా చేశారు.
ఓవరాల్‌గా మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన. సెమీస్ బెర్త్‌పై ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే, ఫైనల్ ఫోర్‌కు చేరితే బాగుంటుంది. సెమీస్‌లో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం సవాలుగా ఉంటుంది. ఇది జట్టుగా మమ్మల్ని పరీక్షిస్తుందని విలియమ్సన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment