దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.
వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్‌వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు.
శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్‌రౌండర్ షో
ఇతర మ్యాచ్‌ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్‌పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు.
అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్‌దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు.
సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్..
నార్త్‌ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్‌ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్‌ఈస్ట్ జోన్‌ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్‌ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్‌లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment