
అండర్ 19 ప్రపంచకప్‌లో ప్రకంపనలు సృష్టించి, బేబీ ఏబీ డివిలియర్స్‌గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఓ అరుదైన ఘనత సాధించాడు. సీనియర్ స్థాయిలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(జనవరి 2022) అవార్డుకు నామినేట్ అయ్యాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి నాన్ సీనియర్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. బ్రెవిస్‌తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(జనవరి) రేసులో దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్, బంగ్లా బౌలర్ ఎబాదత్ హొసేన్ ఉన్నారు.
కాగా, ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 84.33 సగటున 506 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అండర్ 19 స్థాయి క్రికెట్‌లో పలు రికార్డులను నెలకొల్పాడు. సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్(505 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ఒక్క పరుగుల తేడాతో బద్ధలు కొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సైతం ఎగరేసుకుపోయాడు. ఇదిలా ఉంటే, జూనియర్ స్థాయిలో పరుగుల వరద పారిస్తున్న బేబీ ఏబీడీపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ కన్నేశాయి. త్వరలో జరగనున్న మెగా వేలంలో అతనికి భారీ ధర దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చదవండి: IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు