అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు.
బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీ
ఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్‌కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.
అందుకే ఆడలేదు
ఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సానుకూల దృక్పథంతో ఉన్నా
ఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్‌కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్
Comments
Please login to add a commentAdd a comment