టీమిండియా మాజీ క్రికెటర్, కర్ణాటక మాజీ రంజీ ప్లేయర్ డేవిడ్ జాన్సన్ (52) ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. బెంగళూరులో తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడని సమాచారం.
జాన్సన్ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంభ సభ్యులు తెలిపారు. జాన్సన్.. తాను ఆత్యహత్య చేసుకున్న ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.
జాన్సన్ మృతి పట్ల బీసీసీఐ కార్యదర్శి జై షా, అనిల్ కుంబ్లే, గౌతమ్ గంభీర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. జై షా ట్విటర్ వేదికగా జాన్సన్ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులను ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. టీమిండియాకు, కర్ణాటక రంజీ జట్టుకు జాన్సన్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని షా ట్వీట్‌లో పేర్కొన్నాడు.
రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన జాన్సన్ 1996వ సంవత్సరంలో టీమిండియా తరఫున రెండు టెస్ట్ మ్యాచ్‌లు (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) ఆడాడు. జాన్సన్.. తన అరంగేట్రం టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మైఖేల్ స్టేటర్‌ను ఔట్ చేయడం నాటి క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుంటుంది. జాన్సన్.. స్లేటర్‌ను ఔట్ చేసిన బంతి 157.8 గంటకు కిలోమీటర్ల వేగంతో వచ్చింది. ఇది అప్పట్లో అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది.
జాన్సన్ తానాడిన రెండు టెస్ట్‌ల్లో 3 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న జాన్సన్ అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయాడు. జాన్సన్ ఫస్ట్ క్లాస్ ట్రాక్ రికార్డు మెరుగ్గా ఉంది. కర్ణాటక తరఫున 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్..125 వికెట్లు పడగొట్టడంతో పాటు 437 పరుగులు సాధించాడు. జాన్సన్ ఖాతాలో ఓ ఫస్ట్ క్లాస్ సెంచరీ ఉంది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment