కర్ణాటక యువ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన అతను.. తాజాగా మరో సెంచరీ బాదాడు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ అజేయమైన సెంచరీతో (151; 12 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుత సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై శతక్కొట్టిన పడిక్కల్.. గోవాతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ బాదాడు. తాజా సెంచరీతో ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పడిక్కల్ చేసిన సెంచరీల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఏడాది అతను ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు చేయడం విశేషం. సీజన్ మధ్యలో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇతను ఇండియా-ఏ తరఫున సెంచరీ చేశాడు.
ఓవరాల్‌గా పడిక్కల్ ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఇతను.. 42కు పైగా సగటుతో ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 2100కు పైగా పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. 82కు పైగా సగటున మూడు సెంచరీల సాయంతో 450కు పైగా పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది. రవికుమార్ సమర్థ్ 57, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 20, నికిన్ జోస్ 13, మనీశ్ పాండే 1, కిషన్ బెదరే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. పడిక్కల్‌కు జతగా హార్దిక్ రాజ్ (35) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 3, అజిత్ రామ్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఇవాళే మొదలైన పలు రంజీ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర, 110), పృథ్వీ షా (ముంబై, 159), తిలక్ వర్మ (101) సెంచరీలతో కదంతొక్కారు. వీరితో పాటు మనన్ వోహ్రా (134), హిమాన్షు మంత్రి (111), అంకిత్ కుమార్ (హర్యానా, 109), భుపేన్ లాల్వాని (102), సచిన్ బేబీ (110), వైభవ్ భట్ (101), తన్మయ్ అగర్వాల్ (164) లాంటి లోకల్ ప్లేయర్స్ కూడా వేర్వేరు మ్యాచ్‌ల్లో శతక్కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment