ఒకవేళ అక్కడ సచిన్‌ ఉంటే పరిస్థితి ఏంటి? | Funny Incident Commentary Box By Australian Commentator About Gavaskar | Sakshi
Sakshi News home page

ఒకవేళ అక్కడ సచిన్‌ ఉంటే పరిస్థితి ఏంటి?

Published Sat, Jan 9 2021 5:03 PM | Last Updated on Sat, Jan 9 2021 5:30 PM

Funny Incident Commentary Box By Australian Commentator About Gavaskar - Sakshi

సిడ్నీ: ఆసీస్‌, టీమిండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటింగ్‌ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌ సందర్భంగా టీవీ వ్యాఖ్యాత జేమ్స్‌ బ్రేషా కామెంటరీ బాక్స్‌లోకి  లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌, ఆసీస్‌ మాజీ ఆటగాడు డామియన్‌ ప్లెమింగ్‌లను ఆహ్వనించాడు. అయితే గవాస్కర్‌ను చూసి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అనుకున్న బ్రేషా వెల్‌కమ్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని సంబోధించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన గవాస్కర్‌ సచిన్‌ కూడా ఇక్కడికి వచ్చాడా అన్నట్లు వెనక్కి తిరిగి చూశాడు. ప్లెమింగ్‌ తప్ప ఇంకెవరు కనిపించకపోవడంతో గవాస్కర్‌ ఆశ్యర్యం వ్యక్తం చేశాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్‌: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు)

అయితే బ్రేషా గవాస్కర్‌ను చూస్తూ 'మిమ్మల్నే సచిన్'‌ అంటూ మరోసారి చెప్పాడు. ఇది గమనించిన ప్లెమింగ్‌ వెంటనే అందుకొని.. ' వచ్చింది సచిన్‌ కాదని.. గవాస్కర్‌ అంటూ' చెప్పడంతో బ్రేషా నాలుక కర్చుకున్నాడు. ఈ సందర్భంగా బ్రే షా సునీల్‌ గవాస్కర్‌కు సారీ చెప్పడంతో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ కామెంటరీకి సచిన్‌ కూడా వచ్చి ఉంటే బ్రే షా అతన్ని గవాస్కర్‌ అని పిలిచేవాడేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.  కాగా టీమిండియా 207 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 244 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ ఆటగాడు చతేశ్వర్‌ పుజారా(50; 176 బంతుల్లో 5 ఫోర్లు)హాఫ్‌ సెంచరీ సాధించగా, రిషభ్‌ పంత్‌(36; 67 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రహానే(22) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,  రవీంద్ర జడేజా(28 ‌) అజేయంగా నిలిచాడు. 96/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. లబుషేన్‌ 47, స్మిత్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. (చదవండి: అప్పుడూ ఇదే సీన్‌.. మరి టీమిండియా గెలిచేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement