IPL 2023: Gujarat Titans beats Chennai Super Kings by 5 wickets - Sakshi
Sakshi News home page

IPL 2023: అదరగొట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్... తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం

Published Sat, Apr 1 2023 12:39 AM | Last Updated on Sat, Apr 1 2023 8:47 AM

Gujarat Titans win by 5 wickets  - Sakshi

Photo Credit : IPL/BCCI

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌–2023ని డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఘనంగా ప్రారంభించింది. దాదాపు ఏకపక్షంగా సాగిన సీజన్‌ తొలి పోరులో ధోని సేనపై పాండ్యా బృందం విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై భారీ అభిమాన సందోహం మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ (50 బంతుల్లో 92; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (2/26), షమీ (2/29), అల్జారి జోసెఫ్‌ (2/33) రాణించారు. అనంతరం గుజరాత్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్‌ గిల్‌ (36 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.  

రుతురాజ్‌ మినహా... 
చెన్నై మొత్తం ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఇతర బ్యాటర్లంతా విఫలం కాగా అతనొక్కడే ఈ స్కోరులో కీలకపాత్ర పోషించాడు. షమీ చక్కటి బంతితో కాన్వే (1)ను క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో చెన్నై తొలి వికెట్‌ కోల్పోయింది. ఐపీఎల్‌లో షమీకి ఇది 100వ వికెట్‌. ఐర్లాండ్‌ నుంచి ఐపీఎల్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న జోష్‌ లిటిల్‌ తన తొలి ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్నాడు.

షమీ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌తో దూకుడు ప్రదర్శించిన మొయిన్‌ అలీ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్‌)ని రషీద్‌ అవుట్‌ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 51/2కు చేరింది. పాండ్యా ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన రుతురాజ్‌... జోసెఫ్‌ ఓవర్లో మరింత చెలరేగి 3 సిక్స్‌లు బాదడం విశేషం. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది.

ఒకవైపు రుతురాజ్‌ చెలరేగినా... మరోవైపు బెన్‌ స్టోక్స్‌ (7), అంబటి రాయుడు (12) తక్కువ వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. ఈ దశలో గుజరాత్‌ చక్కటి బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసింది. సెంచరీ దిశగా వెళుతున్న రుతురాజ్‌తో పాటు జడేజా (1)ను కూడా ఒకే ఓవర్లో జోసెఫ్‌ వెనక్కి పంపించాడు. శివమ్‌ దూబే (19) ప్రభావం చూపలేకపోగా, ఆఖరి ఓవర్లో ధోని (14 నాటౌట్‌) వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు.  

రాణించిన గిల్‌... 
తుషార్‌ వేసిన రెండో ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టి ఛేదనను వృద్ధిమాన్‌ సాహా (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా మొదలు పెట్టినా... తొలిసారి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న రాజ్‌వర్ధన్‌ మొదటి ఓవర్లోనే అతను వెనుదిరిగాడు. అయితే మరో ఎండ్‌లో గిల్‌ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్‌ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు) కూడా కొద్దిసేపు గిల్‌కు సహకరించాడు.

జడేజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి గిల్‌ 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలో సుదర్శన్, పాండ్యా (8), గిల్‌ వికెట్లు కోల్పోయి గుజరాత్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో విజయ్‌ శంకర్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి 2 ఓవర్లలో 23 పరుగులు చేయాల్సి ఉండగా తెవాటియా (15 నాటౌట్‌), రషీద్‌ ఖాన్‌ (10 నాటౌట్‌) కలిసి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో జట్టును గెలిపించారు.  

స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (బి) షమీ 1; రుతురాజ్‌ (సి) గిల్‌ (బి) జోసెఫ్‌ 92; మొయిన్‌ అలీ (సి) సాహా (బి) రషీద్‌ 23; స్టోక్స్‌ (సి) సాహా (బి) రషీద్‌ 7; రాయుడు (బి) లిటిల్‌ 12; దూబే (సి) రషీద్‌ (బి) షమీ 19; జడేజా (సి) శంకర్‌ (బి) జోసెఫ్‌ 1; ధోని (నాటౌట్‌) 14; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–14, 2–50, 3–70, 4–121, 5–151, 6–153, 7–163. 
బౌలింగ్‌: షమీ 4–0–29–2, పాండ్యా 3–0–28–0, లిటిల్‌ 4–0–41–1, రషీద్‌ 4–0–26–2, జోసెఫ్‌ 4–0–33–2, యష్‌ 1–0–14–0.  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) దూబే (బి) రాజ్‌వర్ధన్‌ 25; గిల్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 63; సుదర్శన్‌ (సి) ధోని (బి) రాజ్‌వర్ధన్‌ 22; పాండ్యా (బి) జడేజా 8; విజయ్‌శంకర్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) రాజ్‌వర్ధన్‌ 27; రాహుల్‌ తెవాటియా (నాటౌట్‌) 15; రషీద్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–37, 2–90, 3–111, 4–138, 5–156.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–29–0, తుషార్‌ దేశ్‌పాండే 3.2–0–51–1, రాజ్‌వర్ధన్‌ 4–0–36–3, సాన్‌ట్నర్‌ 4–0–32–0, జడేజా 4–0–28–1.  

ఐపీఎల్‌లో నేడు 
పంజాబ్‌ VS కోల్‌కతా (మ. గం. 3:30 నుంచి) 
లక్నోVS ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి )
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం


అరిజిత్‌ పాట... రష్మిక, తమన్నా ఆట! 
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు ముందు ఆరంబోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ గాయకుడు అరిజిత్‌ సింగ్‌ మధురమైన గొంతుతో తన కొన్ని అత్యుత్తమ హిట్‌ సాంగ్స్‌ను పాడుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచాడు. కేసరియా, చన్నా మేరేయా, తూ మేరా కోయీనా, పఠాన్‌ తదితర పాటలతో పాటు ‘83’ సినిమాలోని స్ఫూర్తిదాయక పాట ‘లహరాదో’ వచ్చినప్పుడు త్రివర్ణ పతాకాలతో అభిమానులు తమ ఆనందాన్ని ప్రదర్శించారు.

ఇద్దరు హీరోయిన్లు రష్మిక మంధాన, తమన్నా భాటియా చేసిన డ్యాన్స్‌ ప్రదర్శనలతో ‘హౌస్‌ఫుల్‌’ స్టేడియం ఊగిపోయింది. తమిళ హిట్‌ ‘తమ్‌ తమ్‌’, పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా’తో పాటు లవ్‌ యాత్రి సినిమాలోని గుజరాతీ డాండియా పాట ‘రంగీలా తారా’కు డ్యాన్స్‌ చేసినప్పుడు హర్షధ్వానాలతో ప్రేక్షకులు హోరెత్తించారు.

రష్మిక తన హిట్‌ సాంగ్స్‌ సామీ, శ్రీవల్లిలకు డ్యాన్స్‌ చేయడంతో పాటు ఆస్కార్‌ విజేత ‘నాటు నాటు’ పాటకూ నర్తించింది. ఆ స్టెప్పులకు ఫ్యాన్స్‌ అంతా తాము పదం కలిపి జత చేరారు! అనంతరం ప్రత్యేక వాహనాల్లో ధోని, పాండ్యా వేదిక వద్దకు వచ్చారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో గుజరాత్‌ కెపె్టన్‌ పాండ్యా ఐపీఎల్‌ ట్రోఫీని తీసుకొచ్చి వేదికపై ఉంచాడు. ఈ ప్రారంభోత్సవానికి మందిరా బేడీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కార్యక్రమంలో జోష్‌ నింపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement