ద హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘనంగా బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్.. 81 బంతుల్లో 89 పరుగులకే ఆలౌటైంది. ఆడమ్ జంపా (20-10-11-3) ఫీనిక్స్ పతనాన్ని శాశించగా.. మొహమ్మద్ ఆమిర్, సకీబ్ మహమూద్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు, నాథన్ సౌటర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (25), బెన్నీ హోవెల్ (24), బెతెల్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ కేవలం 69 బంతుల్లోనే విజయతీరాలకు (2 వికెట్ల నష్టానికి) చేరింది. విల్ జాక్స్ 6, తువండ మెయేయే 23 పరుగులు చేసి ఔట్ కాగా.. డేవిడ్ మలాన్ (24), సామ్ బిల్లింగ్స్ (31) అజేయంగా నిలిచారు. ఫీనిక్స్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు.
కాగా, ఫీనిక్స్, ఇన్విన్సిబుల్స్ జట్లు నిన్ననే ప్రారంభమైన మహిళల హండ్రెడ్ లీగ్‌లోనూ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ ఫీనిక్స్‌పై ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఫీనిక్స్ 92 బంతుల్లో 105 పరుగులు చేసి ఆలౌటైంది. తద్వారా ఇన్విన్సిబుల్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్‌లో పేజ్ స్కోల్ఫీల్డ్ (71), అలైస్ క్యాప్సీ (52) అర్ద సెంచరీలతో రాణించగా.. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో అమండ 3, మ్యాడీ విల్లియర్స్ 2, మారిజన్ కాప్, సోఫీ స్మేల్, ర్యానా మెక్ డొనాల్డ్ గే తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment