చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు! | Ind vs Aus 1st Test Perth Yashasvi Jaiswal Becomes 1st India Batter To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. టీమిండియా తొలి క్రికెటర్‌గా అత్యంత అరుదైన రికార్డు!

Published Sun, Nov 24 2024 12:30 PM | Last Updated on Sun, Nov 24 2024 12:55 PM

Ind vs Aus 1st Test Perth Yashasvi Jaiswal Becomes 1st India Batter To

పెర్త్‌ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్‌.. ఆస్ట్రేలియా గడ్డ మీద తన మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో తనకిది నాలుగో శతకం.

 

ఈ క్రమంలో ఎన్నెన్నో అరుదైన రికార్డులను యశస్వి జైస్వాల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పెర్త్‌ టెస్టులో శతకం బాది టీమిండియా దిగ్గజాలుగా ఎదిగిన సునిల్‌ గావస్కర్‌, విరాట్‌ కోహ్లి మాదిరి జైస్వాల్‌ కూడా GOAT(గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌)గా పేరొందుతాడంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభం కాగా.. మూడో రోజు ఆటలో భాగంగా యశస్వి జైస్వాల్‌ భారీ శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌.. మరో 92 బంతులు ఎదుర్కొని ఓవరాల్‌గా 161 రన్స్‌ సాధించాడు.

జైస్వాల్‌ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో జైస్వాల్‌ సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా పెర్త్‌ టెస్టులో టీమిండియా ఇప్పటికే నాలుగు వందలకు పైగా ఆధిక్యం సంపాదించి పట్టు బిగించింది.

పెర్త్‌ టెస్టులో సెంచరీ చేసి యశస్వి జైస్వాల్‌ సాధించిన రికార్డులు
👉23 ఏళ్ల వయసు కంటే ముందే టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో.. సునిల్‌ గావస్కర్‌(4), వినోద్‌ కాంబ్లీ(4)ల సరసన యశస్వి నిలిచాడు.  ఈ లిస్టులో సచిన్‌ టెండుల్కర్‌ 8 శతకాలతో మొదటి స్థానంలో ఉండగా.. రవిశాస్త్రి(5) రెండో స్థానంలో ఉన్నాడు.

👉అదే విధంగా.. 23 ఏళ్ల వయసులోపే ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలోనూ జైస్వాల్‌ చోటు సంపాదించాడు. ఈ ఏడాది జైస్వాల్‌ ఇప్పటికి మూడు శతకాలు బాదాడు.

👉ఆస్ట్రేలియా గడ్డమీద తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన మూడో బ్యాటర్‌ జైస్వాల్‌. అతడి కంటే ముందు ఎంఎల్‌ జైసింహా(101- బ్రిస్బేన్‌- 1967-68), సునిల్‌ గావస్కర్‌(113- బ్రిస్బేన్‌-1977-78)లో ఈ ఘనత సాధించారు.

మరో అరుదైన ఘనత.. భారత తొలి క్రికెటర్‌గా
పెర్త్‌ టెస్టులో భారీ శతకంతో యశస్వి జైస్వాల్‌ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆడిన మొదటి పదిహేను టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్‌ రికార్డులకెక్కాడు. 

ఈ క్రమంలో విజయ్‌ హజారే(1420)ను అతడు వెనక్కినెట్టాడు. కాగా 2023లో వెస్టిండీస్‌ గడ్డ మీద జైస్వాల్‌ టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అతడి ఖాతాలో నాలుగు శతకాలు. రెండు డబుల్‌ సెంచరీలు, ఎనిమిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఫోర్ల సంఖ్య 178, సిక్సర్లు 38.

ఆడిన తొలి 15 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
👉డాన్‌ బ్రాడ్‌మన్‌- 2115
👉మార్క్‌ టేలర్‌- 1618
👉ఎవర్టన్‌ వీక్స్‌- 1576
👉యశస్వి జైస్వాల్‌- 1568
👉మైకేల్‌ హస్సీ- 1560.

టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా పెర్త్‌ టెస్టు
👉టాస్‌: టీమిండియా.. తొలుత బ్యాటింగ్‌
👉టీమిండియా తొలి ఇన్నింగ్స్‌- 150 ఆలౌట్‌
👉ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌- 104 ఆలౌట్‌.

చదవండి: IPL 2025 Mega Auction: పేరు మోసిన స్టార్లు.. హాట్‌కేకులు వీళ్లే.. 116 మందిపైనే వేలం వెర్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement