Border Gavaskar Trophy 2023 India vs Australia: ‘‘కాస్త దృష్టి పెట్టండి.. ఏదో ఒక అద్భుతం చేయండి బాస్!’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆస్ట్రేలియా మేనేజర్‌కు సందేశం పంపాడు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మీకు మరిన్ని చేదు అనుభవాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
స్పిన్నర్ల దెబ్బ.. విలవిల్లాడిన ఆసీస్
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 9న ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఆరంభమైంది. అయితే, భారత స్పిన్నర్ల మాయాజాలం, స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల ధాటికి తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ చతికిలపడింది.
నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ రెండు మ్యాచ్‌లను రెండున్నర రోజుల్లోనే ముగించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగులు, 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరింత చేరువైంది.
మరోవైపు.. మిగిలిన ఇండోర్(మార్చి 1-5), అహ్మదాబాద్(మార్చి 9-13) టెస్టుల్లో గనుక ఆసీస్ ఓడితే.. శ్రీలంకతో ప్రమాదం ఎదుర్కోకతప్పదు. ఆస్ట్రేలియా టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురై.. లంక న్యూజిలాండ్ గడ్డపై కివీస్‌ను వైట్‌వాష్ చేస్తే.. ఫైనల్ చేరడం ఖాయమనుకున్న ఆసీస్‌కు పరాభవం తప్పదు.
ఇక ఇప్పటికే గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహాఆరుగురు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
పొట్లం అయిపోతారు జాగ్రత్త!
తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసీస్ మేనేజర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ సౌలభ్యం కోసం నేను ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతున్నా.. ఏదో ఒకటి చేయండి బాస్! ఈ సిరీస్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఏదో ఒకటి చేయండి అబ్బాయిలు.. లేదంటే మీరు ‘పొట్లం’ అయిపోతారు జాగ్రత్త! పొట్లం అంటే ప్యాకెట్ అని అర్థం. అయినా మీరిప్పటికే ప్యాకెట్ అయిపోయారు లెండి!’’ అని చిక్కా సెటైర్లు వేశాడు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అన్న అర్థంలో ఆసీస్‌ను దారుణంగా ట్రోల్ చేశాడు. పోటుగాళ్లలా బిల్డప్ ఇచ్చి ఇప్పుడు చతికిలపడ్డారంటూ పరోక్షంగా పంచులు వేశాడు.
చదవండి: Azam Khan: తుపాన్ ఇన్నింగ్స్.. 42 బంతుల్లోనే.. 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో..
T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్‌తో..
Comments
Please login to add a commentAdd a comment