గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడిన రుతురాజ్ ఆతర్వాత గేర్ మార్చి చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి 22 బంతుల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన రుతు.. ఆతర్వాతి 35 బంతుల్లో ఏకంగా 101 పరుగులు బాదాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రుతురాజ్ విధ్వంసం ఓ రేంజ్‌లో సాగింది.
ఈ ఓవర్‌లో అతను సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేయడంతో పాటు మరో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో రుతురాజ్ భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ చేసిన స్కోర్ (123 నాటౌట్) భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు శుభ్‌మన్ గిల్ (126 నాటౌట్) పేరిట ఉంది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) బాది ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆసీస్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కాగా మ్యాక్సీ, మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) తలో చేయి వేసి ఆసీస్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment