బోర్డర్ గావస్కర్ ట్రోఫీ-2024లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ స్థానంపై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ స్పష్టతనిచ్చాడు. ఈ స్టార్ ప్లేయర్ మిడిలార్డర్‌లోనే వస్తాడని పేర్కొన్నాడు. కెప్టెన్, కోచ్‌లతో చర్చించిన తర్వాత స్మిత్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించాడని తెలిపాడు.
స్మిత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చాలి
కాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో స్మిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, టాపార్డర్‌లో అతడు రాణించలేకపోయాడు. వెస్టిండీస్‌తో గాబాలో అర్ధ శతకం బాదడం మినహా ఓపెనర్‌గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లోనూ అతడి సగటు 28.50గా మాత్రమే నమోదైంది.
ఈ నేపథ్యంలో స్మిత్ బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, స్మిత్ మాత్రం తాను ఓపెనర్‌గా వచ్చేందుకు సుముఖంగానే ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్, ఆండ్రూ, స్టీవ్ స్మిత్.. ముగ్గురూ ఈ విషయంపై చర్చించారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా ఎంతకాలం జట్టుకు దూరంగా ఉంటాడో తెలియని పరిస్థితి.
ఓపెనర్‌గా కాదు.. మిడిలార్డర్‌లోనే..
ఇలాంటి సమయంలో.. తాను ఓపెనర్‌గా ఉండటం కంటే మిడిలార్డర్‌లో ఉండటమే మంచిదని స్మిత్ భావించాడు. అదే విషయాన్ని ప్యాట్, ఆండ్రూతో చెప్పాడు. వాళ్లిద్దరు కూడా స్మిత్ నిర్ణయంతో ఏకీభవించారు. రానున్న సిరీస్‌లలో స్మిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు’’ అని స్పష్టం చేశాడు.
కాగా దశాబ్దకాలానికి పైగా స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు వెన్నెముకలాగా ఉంటున్నాడు. నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన సగటు 61.51తో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల కంగారూ బ్యాటర్లలో స్మిత్ ముఖ్యుడు. ఈ నేపథ్యంలోనే నవంబరులో మొదలుకానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి అతడు మళ్లీ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు.
కామెరాన్ గ్రీన్‌కు వెన్నునొప్పి
కాగా మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆడాల్సి ఉండగా.. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైన గ్రీన్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు.
ఇదిలా ఉంటే.. మాజీ కెప్టెన్లు అలెన్ బోర్డర్- సునీల్ గావస్కర్ పేర్ల మీదుగా సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’
Comments
Please login to add a commentAdd a comment