టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్‌కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.
డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నై మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ జయభేరి మోగించి బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమనిపించింది.
తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే
అయితే, వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు.
దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులను ఉద్దేశించి బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అసలు మైదానాన్ని ఆరబెట్టనేలేదు.
జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో
గత రాత్రి వర్షం లేకపోయినా.. సూపర్ సాపర్స్ ఉన్నా.. సోమవారం ఉదయానికి కూడా గ్రౌండ్ ఇంకా చిత్తడిగానే ఉంది. అంటే.. అక్కడి కవర్స్ సరిగ్గా లేవని అర్థం. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో.. వాళ్లు మాత్రం కాన్పూర్‌లో ఇంకోసారి టెస్టు మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధించాలి’’ అని విజ్ఞప్తి చేశాడు.
ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిస్తే.. డబ్ల్యటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో టీమిండియా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోఅగ్రస్థానంలో టీమిండియా
అయితే, అందులో ఒక్క మ్యాచ్ డ్రా అయినా.. రోహిత్ సేన చిక్కుల్లో పడుతుంది. ఏదేమైనా కాన్పూర్ స్టేడియానికి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అర్హత మాత్రం లేదు’’ అని బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు గెలిచి.. రెండు ఓడిన భారత్.. ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి రెండోస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనున్న రోహిత్ సేన.. ఆతర్వాత ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక...
కాన్పూర్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి బీసీసీఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్‌కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... ‘సి’ బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు.
అందుకే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారు
దేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్‌లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక సోమవారం నాటి నాలుగో రోజు మాత్రం ఆట సజావుగా సాగింది. 107/3తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
చదవండి: ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్.. షాక్‌లో సహచరులు! వీడియో
Comments
Please login to add a commentAdd a comment