ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆలోచనా ధోరణి చిత్రంగా అనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ ఆర్‌పీ సింగ్ అన్నాడు. రోహిత్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నాడు. అతి జాగ్రత్త.. ఆటగాడిగా, కెప్టెన్‌గానూ అతడికి నష్టమే కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు.
కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన భారత్.. రెండో టెస్టులో గెలిచి ప్రస్తుతం 1-1తో సమం చేసింది. తదుపరి గురువారం నుంచి మొదలయ్యే మూడో టెస్టుకు సన్నద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆకట్టుకోలేకపోయాడు. హైదరాబాద్, విశాఖపట్నం టెస్టుల్లో అతడు నమోదు చేసిన స్కోర్లు.. 24, 39, 14, 13. తొలి టెస్టులో దూకుడుగా ఆడి కాస్త మెరుగైన స్కోర్లే చేసిన రోహిత్.. రెండో టెస్టులో మాత్రం ఆచితూచి ఆడినా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఆర్‌పీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అతిగా ఆలోచిస్తున్నాడు.
భారీ స్కోరు నమోదు చేయాలని భావిస్తున్నాడు. అయితే, ప్రధాన ఆటగాళ్లు లేని తరుణంలో మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మాత్రమే దృష్టి సారించాలి. కనీసం 2- 3 పార్ట్‌నర్‌షిప్‌లు వస్తే జట్టు మెరుగైన స్కోరు సాధిస్తుంది.
అయితే, ఈ విషయంలో రోహిత్ అతి జాగ్రత్తతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి అతడి ఆట శైలి ఇందుకు భిన్నం. ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడమే తనకు తెలుసు.
కానీ ఈసారి ఆ ఫీల్ మిస్ అవుతోంది. తనదైన షాట్లు ఆడటంలో రోహిత్ విఫలమవుతున్నాడు. రోహిత్ ఇలా అతిగా ఆలోచిస్తూ ఆడటం ఆటగాడిగా.. వ్యక్తిగా తనకు మంచిది కాదు’’ అని క్రిక్‌బజ్ షోలో రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
కాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్‌కు దూరం కాగా.. తొలి టెస్టు తర్వాత గాయపడ్డ కేఎల్ రాహుల్ ఇంకా కోలుకోలేదు. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్‌లో మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment