Ireland Vs India, 1st T20I: Will Rain Play Spoilsport In Jasprit Bumrah Return - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. అసలే ఏడాది తర్వాత రీఎంట్రీ! ఇప్పుడిలా!

Published Fri, Aug 18 2023 5:51 PM | Last Updated on Fri, Aug 18 2023 6:35 PM

Ind vs Ire 1st T20I: Will Rain Play Spoilsport On Jasprit Bumrah Return - Sakshi

India tour of Ireland, 2023: దాదాపు ఏడాది తర్వాత పునరాగమనం చేస్తున్న టీమిండియా స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు వరణుడు స్వాగతం పలకబోతున్నాడా? ఐర్లాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ నేపథ్యంలో తొలిసారి పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఈ పేసు గుర్రం రీఎంట్రీకి వర్షం ఆటంకిగా మారనుందా? అంటే స్థానిక వాతావరణ శాఖ అవుననే అంటోంది! 

ఐర్లాండ్‌- టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టీ20 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. డబ్లిన్‌లోని ది విలేజ్‌​ వేదికగా ఇరు జట్లు పోటీపడనున్నాయి.  స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల(భారత కాలమానం ప్రకారం రాత్రి 7. 30 గంటలకు)కు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం!
అయితే, డబ్లిన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్న నేపథ్యంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రానికి పరిస్థితి మరింత దిగజారవచ్చని హెచ్చరిస్తూ యెల్లో వార్నింగ్‌ జారీ చేసింది. దీంతో అసలు మ్యాచ్‌ జరుగుతుందా లేదా అంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు.

మ్యాచ్‌ రద్దైతే.. అంతే సంగతి!
బుమ్రా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కితే చూడాలని ఆశ పడుతుంటే ఈ వర్షం గోల ఏమిటని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా వన్డే కప్‌-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్‌ పరీక్షకు ఐర్లాండ్‌ పర్యటన మంచి ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడనుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావించింది. దీంతో రీఎంట్రీలో ఏకంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

తర్వాత ఆసియా కప్‌!
బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఐర్లాండ్‌కు పంపింది. అయితే, వర్షం కారణంగా తొలి మ్యాచ్‌ రద్దైపోతే బుమ్రాతో పాటు యాజమాన్యానికి చేదు అనుభవం తప్పదు. మిగతా రెండు మ్యాచ్‌లకు కూడా ది విలేజ్‌ వేదిక కావడం విశేషం. ఇక ఐర్లాండ్‌ పర్యటన ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఆసియా కప్‌ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది.

ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు:
జస్‌ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్, ముకేష్ కుమార్, ఆవేశ్ ఖాన్.

చదవండి: ఎల్లప్పుడూ రుణపడి ఉంటా: విరాట్‌ కోహ్లి భావోద్వేగ పోస్ట్‌.. వైరల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement