Ind Vs WI 2nd Test: Why Ishan Kishan Says Thanks To Rishabh Pant, Post Match Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ishan Kishan On Rishabh Pant: తన వల్లే ఇలా! సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసిన ఇషాన్‌.. వీడియో

Published Mon, Jul 24 2023 4:08 PM | Last Updated on Mon, Jul 24 2023 4:25 PM

Ind vs Wi 2nd Test: Ishan Kishan Thanks Rishabh Pant Video Viral Why - Sakshi

West Indies vs India, 2nd Test: అరంగేట్ర టెస్టులో మార్కు చూపలేకపోయిన టీమిండియా యువ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌... తదుపరి మ్యాచ్‌లో అదరగొట్టాడు. సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసి తన విలువేంటో చాటుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ సందర్భంగా జార్ఖండ్‌ బ్యాటర్‌ ఇషాన్‌ అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

సింగిల్‌ కోసం 20 బంతులు
వికెట్‌ కీపర్‌గా డొమినికా మ్యాచ్‌ సందర్భంగా భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, తొలి మ్యాచ్‌లో ఈ లెఫ్టాండర్‌కు పెద్దగా బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఏడోస్థానంలో వచ్చిన ఇషాన్‌.. ఒక్క సింగిల్‌ తీయడానికి 20 బంతులు తీసుకున్నాడు. అప్పటికే టీమిండియా పటిష్ట స్థితిలో ఉన్న నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు.

25 పరుగులకు అవుట్‌
ఇక రెండో ఇన్నింగ్స్‌ ఆడే అవకాశమే లేకుండా ఆ మ్యాచ్‌లో రోహిత్‌ సేన ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ట్రినిడాడ్‌ వేదికగా రెండో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ఇషాన్‌ కిషన్‌.. 25 పరుగులకే అవుటయ్యాడు.

తడాఖా చూపించాడు
అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దంచికొట్టాడు. టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి తన స్థానం త్యాగం చేయగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ఇషాన్‌. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తుపాన్‌ ఇన్నింగ్స్‌తో అర్ధ శతకం సాధించాడు. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే సమయానికి 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఆ సమయంలో పంత్‌ నాతోనే ఉన్నాడు
ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ తన సహచర ఆటగాడు, ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడి కోలుకుంటున్న రిషభ్‌ పంత్‌ బ్యాట్‌ను ఉపయోగించడం విశేషం. RP17 అని రాసి ఉన్న బ్యాట్‌తోనే టెస్టుల్లో తన తొలి హాఫ్‌ సెంచరీ నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో తన అద్భుత ఆట తర్వాత ఇషాన్‌ మాట్లాడుతూ.. పంత్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.

‘‘ఇక్కడికి వచ్చే ముందు నేను జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాను. అక్కడే పునరావాసం పొంది ప్రాక్టీస్‌ చేశాను. ఆ సమయంలో రిషభ్‌ పంత్‌ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు తను నాకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాడు. 

ముఖ్యంగా బ్యాట్‌ పొజిషన్‌ గురించి నాతో ఎక్కువగా చర్చించాడు. అండర్‌-19 నుంచే మేము కలిసి ఆడుతున్నాం. కాబట్టి నా బ్యాటింగ్‌, నా మైండ్‌సెట్‌ గురించి తనకు పూర్తి అవగాహన ఉంది. అందుకే తను నాకు సూచనలు ఇవ్వగలిగాడు. 

థాంక్యూ..
ఇలా మనలో మనకు తెలియని చిన్న చిన్న లోపాల గురించి ఇలా ఎవరో ఒకరు చెబితే.. వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. నిజంగా ఈ విషయంలో తనకు నేను కృతజ్ఞుడిగా ఉండాల్సిందే’’ అని ఇషాన్‌.. పంత్‌ గురించి చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. కాగా ట్రినిడాడ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఆతిథ్య విండీస్‌ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 289 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: అంతకు మించి! బొక్కబోర్లా పడ్డ ఇంగ్లండ్‌.. టీమిండియా వరల్డ్‌ రికార్డు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement