
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో వెస్టిండీస్‌ను ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది రోహిత్ సేన. ఇక భారత్- విండీస్ మధ్య తొలి టెస్టు సందర్భంగా మొత్తంగా ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు.
భారత్ తరఫున యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్(టెస్టుల్లో)... వెస్టిండీస్ తరఫున అలిక్ అథనాజ్(టెస్టుల్లో) ఎంట్రీ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో యశస్వి సెంచరీ(171)తో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. అథనాజ్ మొత్తంగా 75 పరుగులతో రాణించాడు. అయితే, ఇషాన్ మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
ముఖ్యంగా సింగిల్ తీయడానికి అతడికి 20 బంతులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటికే ఇన్నింగ్స్ డిక్లేర్ చేద్దామనుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరవడంలో ఆలస్యం చేసిన ఇషాన్‌పై అసహనం ప్రదర్శించాడు.
అతడి వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మిశ్రమ స్పందనలు లభించాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందిస్తూ.. తను అలా ప్రవర్తించడానికి గల కారణం వెల్లడించాడు. విండీస్‌పై విజయం తర్వాత మాట్లాడుతూ.. ‘‘ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి ఇంకొక్క ఓవర్ మాత్రమే ఉందని వాళ్లకు తెలియజేయాలనుకున్నా.
నిజానికి ఇషాన్ కనీసం పరుగుల ఖాతా అయినా తెరవాలని నేను భావించాను. వ్యక్తిగతంగా తనకు ఈ మ్యాచ్ ప్రత్యేకం. ఇషాన్ బ్యాటింగ్ చేయడానికి ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడిలా జరిగింది’’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇషాన్ కోసమే తాము ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కాస్త ఆలస్యం చేసినట్లు పరోక్షంగా వెల్లడించాడు. కాగా డొమినికా మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 12, రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టారు. విండీస్‌ను తక్కువ స్కోర్లకే కట్టడి చేసి టీమిండియా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment