Ind Vs WI 2nd Test: Move Over BazBall India History With DravBall Breaks Australia Record - Sakshi
Sakshi News home page

#DravBall: బజ్‌బాల్‌ కాదు.. అంతకు మించి! బొక్కబోర్లా పడ్డ ఇంగ్లండ్‌.. టీమిండియా వరల్డ్‌ రికార్డు!

Published Mon, Jul 24 2023 3:08 PM | Last Updated on Mon, Jul 24 2023 3:49 PM

Ind Vs WI Move Over BazBall India History With DravBall Breaks Australia Record - Sakshi

సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసిన ఇషాన్‌ కిషన్‌

West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. టెస్టు క్రికెట్‌లో ‘బజ్‌బాల్‌’ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను మించిపోయే విధంగా దంచికొట్టారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌ 30 బంతుల్లో 38, రోహిత్‌ శర్మ 44 బంతుల్లో 57, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్‌ 34 బంతుల్లో 52(నాటౌట్‌) ఆకాశమే హద్దుగా బ్యాట్‌తో వీరవిహారం చేశారు.

సంచలన ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డు
ఈ ముగ్గురి అద్భుత ఆట తీరు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది భారత జట్టు. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి విండీస్‌కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌ టెస్టులో సంచలన ఆట తీరుతో టీమిండియా టెస్టుల్లో చరిత్ర సృష్టించింది.

ఆస్ట్రేలియా పేరిట ఉన్న అరుదైన రికార్డు బద్దలు కొట్టి సత్తా చాటింది. కాగా విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 24 ఓవర్లలో రోహిత్‌ సేన 7.54 రన్‌రేటుతో 181 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో కనీసం 20 ఓవర్ల ఆటలో అత్యధిక రన్‌రేటుతో ఎక్కువ పరుగులు రాబట్టిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది.

ఆస్ట్రేలియా అప్పుడలా
అంతకు ముందు ఆస్ట్రేలియా.. 2017లో సిడ్నీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 7.53 రన్‌రేటుతో 241 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అంతేకాదు.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కు అందుకున్న జట్టుగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించింది.

ఇది ద్రవ్‌బాల్‌..
ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బజ్‌బాల్‌ కాదు.. అంతకుమించి! ఇది ‘ద్రవ్‌బాల్‌’(హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఉద్దేశించి). ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. వాట్‌ టుడూ వాట్‌ నాట్‌ టుడూ’’ అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే, విండీస్‌ లాంటి బలహీన(ప్రస్తుతం) జట్టుపై ఆడటం కాదు.. పటిష్ట జట్లపై ప్రతాపం చూపాలని పెదవి విరిచేవాళ్లూ లేకపోలేదు.

మెకల్లమ్‌ వచ్చిన తర్వాత
కాగా న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆట తీరులో పలు మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నాయకత్వంలో మెకల్లమ్‌ మార్గదర్శనంలో పరిమిత ఓవర్ల మాదిరే టెస్టు క్రికెట్‌లోనూ దూకుడుగా ఆడుతోంది.

ఈ క్రమంలో బజ్‌బాల్‌ ఫేమస్‌ అయింది. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌-2023లో మాత్రం ఈ విధానంతో ఇంగ్లండ్‌ బొక్కబోర్లా పడింది. ఇప్పటికే 1-2తో వెనుకపడి ట్రోఫీని కోల్పోయే దుస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్‌ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

చదవండి:  Ashes 2023: లెజెండ్‌ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement