ఇషాన్ కిషన్‌తో రోహిత్ శర్మ
Ind vs WI 2nd Test: టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు. వికెట్ కీపర్‌గా తుది జట్టులో స్థానం దక్కించుకున్న అతడికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇషాన్‌తో పాటు ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగడం, మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదడం టీమిండియాకు కలిసి వచ్చింది.
విరాట్ కోహ్లి సైతం అర్ధ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా 421-5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికి క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 20 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు తీసి అంతర్జాతీయ టెస్టు రన్స్ ఖాతా తెరిచాడు. ఇక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంతో విండీస్ కుప్పకూలడంతో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
ఇషాన్ వెరీ టాలెంటెడ్
ఈ మ్యాచ్‌లో ఇషాన్ బ్యాటర్‌గా ఆకట్టుకోలేకపోయినా వికెట్ కీపర్‌గా ఫర్వాలేదనిపించాడు. అయితే, జూలై 20న ఆరంభం కానున్న రెండో టెస్టులో అతడిని కొనసాగిస్తారా లేదంటే ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్‌కు అవకాశమిస్తారా అన్న చర్చ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి.. ‘‘ఇషాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. టీమిండియా తరఫున ఏడాదిన్నర కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్బుతంగా రాణించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు.
ఇలాంటి టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడం మన బాధ్యత. అతడికి మేము కచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. ముఖ్యంగా లెఫ్టాండ్ బ్యాటర్.. కాబట్టి అతడి వైపు మొగ్గుచూపాల్సి వస్తోంది. అతడికి దూకుడుగా ఆడటం ఇష్టం. అయితే, మేనేజ్‌మెంట్ తను ఎలా ఆడాలని కోరుకుంటుందో స్పష్టంగా వివరించాను. అలా అని అతడికి స్వేచ్ఛ హరించుకుపోదు. రాణించగల సత్తా ఉన్నవాడు.
వరుస అవకాశాలు
అతడికి కాస్త ఫ్రీడం ఇచ్చి.. వరుస అవకాశాలు ఇస్తే తనను తాను నిరూపించుకుంటాడు. విండీస్‌తో తొలి టెస్టులో అతడి వికెట్ కీపింగ్ నైపుణ్యాలు నన్ను ఆకట్టుకున్నాయి’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులోనూ ఇషాన్‌ను కొనసాగిస్తామని కెప్టెన్ స్పష్టం చేశాడని, వరుస అవకాశాలు ఇస్తామని చెప్పాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
మరి వాళ్లు?
ఇషాన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ సా, సర్ఫరాజ్ ఖాన్, భరత్ వంటి ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారని.. అయినా ఇషాన్‌వైపే మొగ్గు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత వికెట్ కీపర్‌గా ఎవరు ఉంటారంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియా విండీస్‌తో రెండో టెస్టులో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment