
West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో 3500 పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో తొలి మ్యాచ్ ఆడుతోంది.
ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డొమినికా వేదికగా బుధవారం టెస్టు ఆరంభమైంది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. తద్వారా 162 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక విండీస్‌తో టెస్టుతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ సెంచరీ సాధించాడు.
రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రస్తుతం 143 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. హిట్‌మ్యాన్ సైతం ఈ మ్యాచ్‌లో శతకంతో సత్తా చాటాడు. 221 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. రోహిత్‌కు టెస్టుల్లో ఇది పదో సెంచరీ. ఈ క్రమంలో రోహిత్ టెస్టుల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ప్రపంచ రికార్డు
తద్వారా మూడు ఫార్మాట్లలో ఈ మైలురాయిని అందుకున్న రెండవ బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించి రికార్డుల్లోకెక్కాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున టెస్టుల్లో 3500 పరుగుల మార్కును అందుకున్న 20వ బ్యాటర్‌గా నిలిచాడు.
కోహ్లి, పుజారా, రహానే
ఈ జాబితాలో కోహ్లి(8,479), ఛతేశ్వర్ పుజారా (7,195), అజింక్య రహానే (5,066) తదితరులు యాక్టివ్ క్రికెటర్లలో రోహిత్ కంటే ముందు వరుసలో ఉన్నారు. కాగా హిట్‌మ్యాన్ ఇప్పటి వరకు 51 టెస్టులాడి 3540 పరుగులు సాధించాడు. ఇందులో పది సెంచరీలు, ఒక ద్విశతకం, పద్నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్
Ind Vs WI: ఏరికోరి వచ్చావు! ఏమైందిపుడు? అప్పుడు కూడా ఇలాగే! మార్చుకో..