‘టీమిండియాకు మరో నయా ఫినిషర్‌’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్‌.. కానీ | Ind W Vs Aus W 1st ODI Fans Hails Pooja Vastrakar Unbeaten 62 New Finisher | Sakshi
Sakshi News home page

Ind W vs Aus W: ‘టీమిండియాకు మరో నయా ఫినిషర్‌’.. దుమ్ములేపిన ఆల్‌రౌండర్‌.. కానీ

Published Thu, Dec 28 2023 5:45 PM | Last Updated on Thu, Dec 28 2023 9:56 PM

Ind W Vs Aus W 1st ODI Fans Hails Pooja Vastrakar Unbeaten 62 New Finisher - Sakshi

Update: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. వాంఖడేలో 46.3 ఓవర్లలోనే టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

దుమ్ములేపిన భారత ఆల్‌రౌండర్‌
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో అదరగొట్టిన భారత మహిళా క్రికెటర్‌ పూజా వస్త్రాకర్‌ తొలి వన్డేలోనూ సత్తా చాటింది. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌  కేవలం 46 బంతుల్లోనే 62 పరుగులతో దుమ్ములేపింది.

దీంతో టీమిండియా తరఫున మరో నయా ఫినిషర్‌ వచ్చేసిందంటూ అభిమానులు పూజా వస్త్రాకర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సొంతగడ్డపై ఆసీస్‌తో ఏకైక టెస్టులో గెలుపొంది చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు గురువారం నుంచి వన్డే సిరీస్‌ మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా ముంబైలోని వాంఖడేలో టాస్‌ గెలిచిన ఆతిథ్య టీమిండియా.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాపార్డర్‌లో ఓపెనర్‌ యస్తికా భాటియా 49 పరుగులతో రాణించగా.. మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటైంది.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన రిచా ఘోష్‌ 21 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పూర్తిగా నిరాశపరిచింది. మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇలా ఓవైపు వికెట్లు పడుతున్నా జెమీమా రోడ్రిగ్స్‌ పట్టుదలగా నిలబడి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. 77 బంతుల్లో 82 పరుగులు సాధించింది. జెమీమా తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన దీప్తి శర్మ 21, అమన్‌జోత్‌ కౌర్‌ 20, స్నేహ్‌ రాణా 1 పరుగులు చేశారు. దీంతో స్వల్ప స్కోరుకే భారత్‌ను కట్టడి చేయగలమన్న ఆస్ట్రేలియా ఆశలపై పూజా వస్త్రాకర్‌ నీళ్లు చల్లింది.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో.. రేణుకా ఠాకూర్‌ సింగ్‌(5- నాటౌట్‌)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి సత్తా చాటింది. యస్తికా, జెమీమా, పూజా అద్భుత బ్యాటింగ్‌ కారణంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 282 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో డారిస్‌ బ్రౌన్‌, మేగన్‌ షట్‌, అన్నాబెల్‌ సదర్లాండ్‌, అలనా కింగ్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. ఆష్లే గార్డ్‌నర్‌, వెరెహాం తలా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement