చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): కింగ్స్ కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు మూడో స్థానం కోసం పోటీపడనుంది. ఇరాక్ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ‘పెనాల్టీ షూటౌట్’లో 4–5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. టోర్నీ నిబంధనల ప్రకారం అదనపు సమయం ఆడించకుండా నేరుగా ‘షూటౌట్’ ద్వారా ఫలితాన్ని నిర్ణయించారు.
‘షూటౌట్’లో తొలి షాట్‌ను భారత ప్లేయర్ బ్రాండన్ ఫెర్నాండెజ్ గోల్ పోస్ట్‌కు కొట్టాడు. ఆ తర్వాత సందేశ్ జింగాన్, సురేశ్, అన్వర్ అలీ, రహీమ్ అలీ గోల్స్ చేశారు. ఇరాక్ తరఫున ఐదుగురు ఆటగాళ్లూ గోల్స్ సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్ తరఫున మహేశ్ 16వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. 28వ నిమిషంలో కరీమ్ అలీ గోల్‌తో ఇరాక్ స్కోరును 1–1తో సమం చేసింది.
51వ నిమిషంలో ఇరాక్ కెపె్టన్ జలాల్ హసన్ సెల్ఫ్ గోల్‌తో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 79వ నిమిషంలో అయ్‌మెన్ గోల్‌తో ఇరాక్ 2–2తో స్కోరును సమం చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాక్‌పై భారత్ ఏనాడూ గెలవలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఆరు మ్యాచ్‌ల్లో ఇరాక్ నెగ్గగా, మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. లెబనాన్, థాయ్‌లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పరాజిత జట్టుతో మూడో స్థానం కోసం భారత్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment