
Ajit Agarkar Comments on India T20 Worldcup Team: రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో మార్పులు చేయాలని పలువురు మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ జట్టు మార్పులపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. గాయాలు కారణంగా జరిగే మార్పులను మినహాయించి, సెలెక్టర్లు మొదట ఎంపిక చేసిన జట్టుకే కట్టుబడి ఉండాలని అతడు అభిప్రాయపడ్డాడు. టీమిండియా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ వారి ఎంపిక చేసిన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అగార్కర్ తెలిపాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్ ఆధ్బతమైన ఆటగాళ్లు. ఐపీఎల్ 14 వ సీజన్ ముగిసేలోపు వారు తిరిగి ఫామ్ పొందుతారని అగార్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ దీపక్ చాహర్ రిజర్వ్ ఆటగాళ్లతో కూడిన 15 మంది సభ్యుల భారత బృందాన్ని గత నెలలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఐసీసీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. జట్లు అక్టోబర్ 10 లోపు తమ జట్టులో మార్పులు చేయవచ్చు. ప్రపంచకప్ జట్టులో స్ధానం దక్కని శిఖర్ ధావన్ ,యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్లు ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో ఎంపికైన కొంతమంది ఆటగాళ్లు ఫామ్‌లో లేనందున చాహల్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లను జట్టులో తీసుకోవాలని మాజీలు సెలెక్టర్లను కోరుతున్నారు.