క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సమయం దగ్గరపడుతోంది. ఐర్లాండ్ పర్యటన ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి దాయాదుల పోరుపైనే పడింది. ఆసియాకప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న కాండీ వేదికగా పాక్- భారత జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ సారి ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో 4 ఏళ్ల తర్వాత చిరకాల ప్రత్యర్థులు ముఖాముఖి తలపడనున్నారు. భారత్-పాక్ జట్లు చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో అద్బుతమైన విజయం సాధిచింది. అయితే ఈ ఏడాది ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా జరగనుండడంతో దాయాదులు నాలుగు సార్లు తలపడే అవకాశం ఉంది.
ఆసియాకప్‌లో భారత్-పాక్ ఫైనల్‌కు చేరితే గ్రూపు మ్యాచ్‌తో పాటు తుది పోరులో కూడా తలపడనున్నాయి. అదే విధంగా వరల్డ్‌కప్‌లో కూడా లీగ్ మ్యాచ్‌తో పాటు ఫైనల్‌కు చేరితే రెండు సార్లు ఎదురుపడనున్నాయి. దీంతో మొత్తంగా రెండు నెలల వ్యవధిలో భారత్-పాక్ జట్లు నాలుగు సార్లు తలపడే ఛాన్స్ ఉంది. ఇక ముందుగా ఆసియాకప్‌లో భారత్-పాక్ హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం.
భారత్‌దే పై చేయి..
ఆసియాకప్ వన్డే ఫార్మాట్‌లో భారత్-పాకిస్తాన్ ముఖాముఖి 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పాకిస్తాన్ 5 సార్లు గెలుపొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో భారత్ 49 మ్యాచ్‌లు ఆడగా.. 31 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 16 సార్లు ఓటమి పాలైంది. అదే విధంగా పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో 26 విజయాలు, 18 ఓటములు నమోదు చేసింది. ఆసియాకప్‌లో భారత్ విజయ శాతం 65.62గా ఉంది.
కాగా ప్రస్తుతం ఆసియా కప్ 16వ ఎడిషన్. ఈ మెగా ఈవెంట్ 14 సార్లు వన్డే ఫార్మాట్‌లో జరగ్గా.. రెండు సార్లు టీ20 ఫార్మాట్‌లో జరిగింది. చివరగా 2018లో ఆసియా వన్డే కప్ జరగనుంది. గత ఎడిషన్‌లో టీమిండియానే విజేతగా నిలిచింది.
ఈ సారి భారత్ ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యధికంగా 7 సార్లు భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆరు సార్లు వన్డే ఫార్మాట్‌లో విజయం సాధించగా.. ఒక్క సారి టీ20 ఫార్మాట్‌లో ట్రోఫిని సొంతం చేసుకుంది.
1984లో యూఏఈ గడ్డపై తొలిసారిగా ఆసియాకప్‌ను భారత జట్టునే కైవసం చేసుకుంది. అయితే పాకిస్తాన్ మాత్రం కేవలం రెండు సార్లు మాత్రమే ఆసియాకప్ ట్రోఫీని గెలుచుకుంది. 2000, 2012 లో పాకిస్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా ఈ కాంటెనెంట్‌ల్ కప్‌లో భారత్-పాక్ జట్లు ఒక్క సారి కూడా ఫైనల్లో తలపడకపోవడం గమనార్హం.
భారత్ తర్వాత అత్యధిక సార్లు ఆసియాకప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న రికార్డు శ్రీలంక పేరిట ఉంది. లంక ఇప్పటివరకు 6 సార్లు విజేతగా నిలిచింది. ఇక ఈ ఏడాది ఆసియాకప్ ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న నేపాల్-పాకిస్తాన్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
చదవండి: ODI WC 2023: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. వరల్డ్‌కప్ టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచి అంటే?
Comments
Please login to add a commentAdd a comment