ఆసియాకప్ సూపర్-4లో టీమిండియా శుభారంభం చేసింది. కొలంబో వేదికగా దయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
కోహ్లి(122), రాహుల్(111) ఆజేయ శతకాలతో చెలరేగగా.. గిల్(58), రోహిత్ శర్మ(56) పరుగులతో రాణించారు. అనంతరం 32 ఓవర్లలోనే 128 పరుగులకు పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన నసీమ్ షా, హరీస్ రవూఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో అదరగొట్టాడు.
ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. రిజర్వ్‌డే రోజు కూడా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికి మ్యాచ్ సజావుగా కొనసాగడానికి తీవ్రంగా కృషిచేసిన గ్రౌండ్స్‌మెన్‌పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.
వారి వల్లే ఈ విజయం..
"ఈ మ్యాచ్‌కు వర్షం చాలా సార్లు అంతరాయం కలిగించింది. ఔట్ ఫీల్డ్ కూడా కొంచెం తడిగా ఉండేది. ఈ క్రమంలో కాస్త ఆలస్యమైనా మ్యాచ్ ప్రారంభమైతే బాగుంటుందని మేము భావించాము. మాలో కొంత మందికి మ్యాచ్ ఫలితం తేలుతుందన్న నమ్మకం కూడా లేదు.
కానీ గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమించి పూర్తి స్థాయి మ్యాచ్ జరిగేలా చేశారు. కాబట్టి వారికి ఈ క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే కవర్లు కప్పుతూ.. తీయడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. మా జట్టు తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక బ్యాటింగ్‌లో మేము అద్బుతమైన ప్రదర్శన కనబరిచాము.
మేము ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టినప్పుడు వికెట్ బాగుందని మాకు అర్ధమైంది. అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాం. కానీ దురదృష్టవశాత్తూ వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. రెండో రోజు అనుభవజ్ఞులైన కోహ్లి, రాహుల్ క్రీజులో సెటిల్ కావడానికి కాస్త సమయం తీసుకుంటారని మాకు ముందే తెలుసు. ఆ తర్వాత వారి విశ్వరూపం చూపించారు. వీరిద్దరూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
మేము టాస్‌కు 5 నిమిషాల ముందు రాహుల్‌కు సమాచారమిచ్చాం. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన కేఎల్ తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు.అదే విధంగా బుమ్రా కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. బంతిని స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడు 8 నుంచి 10 నెలలపాటు ఏన్సీఏలో తీవ్రంగా శ్రమించాడు. కుల్దీప్ కూడా తన అనుభవాన్ని మరోసారి ప్రదర్శించాడని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. రైనా ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment