సొంతగడ్డపై అర్హత టోర్నీ... 8 జట్లలో టాప్–3లో నిలిస్తే సరిపోయే సులువైన ఫార్మాట్... ప్రత్యర్థి బలహీనమైన జపాన్... ఆ టీమ్‌పై గత ఐదు మ్యాచ్‌లలో వరుసగా గెలిచిన రికార్డు... క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు ... కానీ ఒక్క దానినీ గోల్‌గా మలచలేని వైఫల్యం... వెరసి వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయింది... గత టోక్యో ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి ఆశలు రేపిన జట్టు ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత కాలేకపోయింది.
రాంచీ: భారత మహిళల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో కనీసం మూడో స్థానంలో నిలిస్తేనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండగా, భారత్ దానిని కోల్పోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జపాన్ చేతిలో 0–1 గోల్ తేడాతో ఓటమి పాలైంది.
జపాన్ తరఫున 6వ నిమిషంలో కానా ఉరాటా పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మన జట్టు స్కోరును సమం చేయలేకపోయింది. శుక్రవారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో జర్మనీ 2–0తో అమెరికాను ఓడించింది. టాప్–3లో నిలువడం ద్వారా జర్మనీ, అమెరికా, జపాన్ జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.
సమష్టి వైఫల్యం...
జపాన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా భారత కీపర్ సవిత అడ్డుకోగలిగింది. అయితే మరో నాలుగు నిమిషాల వ్యవధిలోనే జపాన్‌కు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. మొదటిసారి విఫలమైనా... రెండో సారి సవిత అడ్డంకిని దాటడంలో జపాన్ సఫలమైంది. ఆ తర్వాతి నుంచి జపాన్ తమ ఏకైక గోల్‌ను నిలబెట్టుకునేందుకు డిఫెన్స్‌పై బాగా దృష్టి పెట్టింది. దీనిని ఛేదించేందుకు భారత ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఈ క్రమంలో వరుసగా పెనాల్టి లను మన జట్టు వృథా చేసుకుంది. 12వ నిమిషంలో మోనిక అందించిన పాస్‌తో లాల్‌రెమిసియామి చేసిన ప్రయత్నంలో బంతి గోల్‌పోస్ట్‌పైనుంచి వెళ్లిపోయింది. రెండో క్వార్టర్‌లో రెండు పెనాల్టీ అవకాశాలను దీపిక గోల్‌గా మలచలేకపోయింది. ఆపై ఒత్తిడిని లోనైన ప్లేయర్లు పాస్‌లు ఇవ్వడం మానేసి ఆశ్చర్యకరంగా 30 గజాల సర్కిల్ నుంచే బంతిని బలంగా బాదే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత వచ్చిన పెనాల్టి లను ఉదిత వృథా చేసింది. చివరి 11 నిమిషాల్లో కూడా భారత్‌కు 3 పెనాల్టీలు దక్కగా ఈసారి కూడా దీపిక, ఉదిత చేతులెత్తేశారు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు జపాన్ పటిష్ట డిఫెన్స్‌ను ఛేదించి సలీమా టెటె గోల్‌పోస్ట్ వైపు దూసుకుపోయినా... ఆమె కొట్టిన షాట్ పోస్ట్‌కు దూరంగా వెళ్లిపోయింది.
పని చేయని వ్యూహాలు...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన నెదర్లాండ్స్ మాజీ ప్లేయర్ జేన్‌కే స్కాప్‌మన్ ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్‌గా ఉంది. సీనియర్లను పక్కన పెట్టి చాలా వరకు యువ క్రీడాకారిణులతోనే ఫలితాలు రాబట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలితమివ్వలేదు. రెగ్యులర్ డ్రాగ్‌ఫ్లికర్ ఒక్కరూ లేకుండా ఫార్వర్డ్‌లను పెనాల్టీ గోల్ కోసం నమ్ముకోవడం పెద్ద తప్పు. ఈ టోర్నీలో జర్మనీ మినహా ర్యాంకింగ్‌పరంగా మిగతా జట్లన్నీ భారత్‌కంటే బలహీనమైనవే. మనల్ని ఓడించిన జపాన్ జట్టుకు భారత మాజీ ఆటగాడు జూడ్ మెనెజెస్ హెడ్ కోచ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment