అపరిమితమైన ప్రేమ.. అపరిమితమైన కేలరీలు.. ఆ బాలుడికి అన్నీ ఎక్కువే. నానమ్మ చేత్తో ప్రేమగా తినిపించే రోటీ, లడ్డూలు, మీగడ, జున్ను.. నెయ్యి, చక్కెర కలిపి చేసే చూర్మా. హరియాణ్వీ వంటకాలు తినీ తినీ.. టీనేజ్‌లోకి వచ్చేసరికి సహజంగానే బొద్దుగా తయారయ్యాడు. దాంతో అప్పటి వరకు చూపించిన ప్రేమ కాస్తా కుటుంబసభ్యుల్లో ఒకింత ఆందోళనగా మారింది. ఇలా అయితే ఎలా అంటూ అతని తండ్రి, ఆయన ముగ్గురు సోదరులు కలసి ఆ కుర్రాడిని వెంటనే జిమ్‌లో చేర్పించి బరువు తగ్గించే ప్రయత్నంలో పడ్డారు.
అయితే తమ సమీపంలోని ఊర్లో ఉన్న ఆ జిమ్ నాలుగు రోజులకే మూతపడటంతో కుర్రాడు ఖుష్ అయ్యాడు. కానీ కుటుంబసభ్యులు మాత్రం వదిలిపెట్టలేదు. సొంత ఊరు ఖాండ్రా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిమ్‌కు వెళ్లైనా ఆకారం మార్చాల్సిందే అని షరతు పెట్టారు. దాంతో ఆ అబ్బాయికి వెళ్లక తప్పలేదు. కానీ తాను కొత్తగా వెళుతున్న ఊరు తన జీవితాన్ని, రాతను మారుస్తుందని.. చిరస్థాయిగా నిలిచే ఘనతను సృష్టించేందుకు దారి చూపిస్తుందని అతను ఊహించలేదు. అయిష్టంగానే చారిత్రక పట్టణం పానిపట్‌కు వెళ్లిన ఆ కుర్రాడు నీరజ్ చోప్రా.. భారత క్రీడల్లో ఒక కొత్త చరిత్రను రాసిన ఆటగాడు.
‘విజయం సాధించాలనే కాంక్ష మీకు నిద్ర పట్టనివ్వకపోతే.. కష్టపడటం తప్ప మరే విషయం మీకు నచ్చకపోతే.. ఎంత శ్రమించినా అలసట అనిపించకపోతే.. విజయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు అని అర్థం చేసుకోండి’.. ట్విటర్‌లో ఈ స్ఫూర్తిదాయక వ్యాఖ్యను పెట్టింది జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌కి రెండేళ్ల ముందు! అప్పటికి సాధించిన ఘనతలు అతనికేమాత్రం సంతృప్తినివ్వలేదని, అసలు లక్ష్యం వేరే ఉందని అతని మాటలను బట్టి అనిపించింది. నిజంగానే అతను తన ఉత్సాహాన్ని మాటలతో సరిపెట్టలేదు. అందుకు అనుగుణంగా కఠోర సాధన చేశాడు. అలసట లేకుండా శ్రమించాడు.
చివరకు ఆ ప్రయాణం ఒలింపిక్స్ పతకం వరకు సాగింది. కానీ అంతటితో ఆగిపోకుండా రెండేళ్లు తిరిగేలోగా ప్రపంచ చాంపియన్ షిప్‌లోనూ స్వర్ణం సాధించి జావెలిన్ లో తనకు ఎదురే లేదని నిరూపించాడు. 13 ఏళ్ల వయసులో ఇంట్లోవాళ్ల ఒత్తిడితో జిమ్‌లోకి అడుగుపెట్టిన అతను తర్వాతి 13 ఏళ్లలో అసమాన ఘనతలన్నీ సాధించిన జగజ్జేతగా నిలవడం నీరజ్ స్థాయిని చూపిస్తోంది.
బల్లెం విసిరితే..
నీరజ్ చేతిలో బల్లెంతో రన్‌వేపై అడుగులు వేయడం మొదలు పెట్టగానే ఒకటి మాత్రం ఖాయమవుతుంది. అదే అతను కచ్చితంగా పతకం గెలవడం! భారత క్రీడల్లో ఇంత నిలకడగా విజయాలు దక్కడం దాదాపుగా కనిపించదు. సీనియర్ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇటీవలి ప్రపంచ చాంపియన్ షిప్ వరకు తాను పోటీపడ్డ ప్రతిచోటా పతకంతోనే తిరిగొచ్చాడు. అతనికి మెడల్ అందించిన 88.17 మీటర్ల దూరం నీరజ్ టాప్–5లో కూడా లేదు. కానీ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి దానికి అనుగుణంగా తన ఆటను మార్చుకోగల ప్రత్యేక లక్షణం అతడిని విజేతగా నిలబెట్టింది. గణాంకాలు మాత్రమే ప్రతిసారి ఆటగాడి గొప్పతనాన్ని చెప్పలేవు. కానీ నీరజ్ విషయంలో అంకెలు ఒక పెద్ద కథే చెబుతాయి.
టోర్నీ టోర్నీకి ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ పోవడం, ఒక పెద్ద విజయంతో సంతృప్తి చెందకుండా మళ్లీ స్టార్టింగ్ పాయింట్ వద్దకు వచ్చి కొత్తగా అంతే ఉత్సాహంతో పోటీకి సిద్ధమవడం అతడిని గొప్పగా నిలబెట్టాయి. తన టాప్–10లో తొమ్మిది దూరాలను అతను ఒలింపిక్స్‌లో స్వర్ణం తర్వాతే నమోదు చేశాడు. కెరీర్‌లో 10 సార్లు అతను బల్లేన్ని 88 మీటర్లకు పైగా దూరం విసరడం విశేషం. ఎండా.. వాన.. సంబంధం లేదు.. అనారోగ్యం అనే మాటే లేదు. ఎప్పుడైనా సాధన చేయాల్సిందే. ఏ బరిలో అయినా బల్లేన్ని విసిరేందుకు సిద్ధమవాల్సిందే!
పానిపట్ నుంచే మొదలు పెట్టి...
నీరజ్ చోప్రా కుటుంబం ‘రోర్’ తెగకు చెందింది. మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి తర్వాత అక్కడే స్థిరపడిన మరాఠాల వారసులుగా వీరి గురించి చెబుతారు. నలుగురు అన్నదమ్ముల్లో అతని తండ్రి ఒకడు. 16 మంది సభ్యుల ఈ ఉమ్మడి కుటుంబానికి కలిపి ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు బర్రెలు, మూడు ఆవులు అదనపు ఆస్తి! ఇలాంటి స్థితిలో తమ అబ్బాయిని అంతర్జాతీయ ఆటగాడి స్థాయికి చేర్చడం అంత సులువైన విషయం కాదు.
ప్రాక్టీస్ జావెలిన్, మ్యాచ్ జావెలిన్ లు మొదలు డైట్, ఫిట్‌నెస్ వరకు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. అయితే సాహసికులు, సత్తా ఉన్నవారికే అదృష్టం కూడా వెంట ఉంటుందన్నట్లుగా నీరజ్‌కు తన కెరీర్‌లో పెద్దగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టలేదు. తమ స్థాయికి తగినట్లుగానే ఆరంభంలో కుటుంబ సభ్యులందరూ అండగా నిలిచారు.
పానిపట్ నుంచి మొదలుపెట్టి ప్రపంచ చాంపియన్ గా మారడం వరకు అతని ఆట ముందు అన్ని అవరోధాలూ చిన్నబోయాయి. 2010లో పానిపట్ శివాజీ స్టేడియంలో కసరత్తులు చేస్తున్న సమయంలో ఒకసారి సరదాగా జావెలిన్ విసురుతూ మరో త్రోయర్ జైవీర్ కంట్లో పడ్డాడు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా తొలి ప్రయత్నంలోనే 40 మీటర్ల వరకు జావెలిన్ వెళ్లడం జైవీర్‌ను ఆకట్టుకుంది.
అతనే ఆది గురువుగా నీరజ్‌కు ఆటలో ఓనమాలు నేర్పించాడు. ఏడాది తర్వాత మరింత మెరుగైన శిక్షణ కోసం పంచకులలో దేవీలాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అడుగుపెట్టిన నీరజ్‌ను కోచ్ నసీమ్ అహ్మద్ మరింతగా తీర్చిదిద్దాడు. సింథటిక్ రన్ వే సౌకర్యం ఉండటంతో అతని త్రోయింగ్‌లో పదును పెరిగింది. ఇక పోటీల్లో సత్తా చాటే సమయం ఆసన్నమవగా.. జిల్లాస్థాయి పోటీల్లో తొలిసారి విజేతగా నిలవడంతో ప్రారంభమైన గెలుపు ప్రస్థానం ఆపై శిఖరాలకు చేరింది.
ఒకటిని మించి మరొకటి..
15 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్ షిప్‌ను గెలుచుకోవడంతో నీరజ్ గురించి అందరికీ తెలిసింది. ఆ తర్వాత రెండేళ్లకు వరల్డ్ యూత్ చాంపియన్ షిప్‌లో రజతంతో ఈ కుర్రాడిలో సత్తా ఉందని అథ్లెటిక్స్ ప్రపంచం గుర్తించింది. తర్వాతి ఏడాదే జూనియర్ ప్రపంచ రికార్డు కూడా అతను బద్దలు కొట్టాడు. అయితే 2015లో కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో నీరజ్‌కు పతకం దక్కలేదు.
అతను ఐదో స్థానంతోనే సరి పెట్టుకున్నాడు. కానీ అథ్లెటిక్స్ సమాఖ్య ఫలితాన్ని పట్టించుకోకుండా ప్రత్యేక ప్రతిభావంతుడిగా పటియాలాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లో సాధన చేసే అవకాశం అతనికి కల్పించింది. ఇది తన కెరీర్‌లో సరైన మలుపుగా నీరజ్ చెప్పుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, ప్రముఖ కోచ్‌లతో శిక్షణ, ప్రత్యేక డైట్ కారణంగా అతను ఎన్ ఐఎస్‌లో టాప్ అథ్లెట్‌గా రూపుదిద్దుకున్నాడు.
ఆ తర్వాత అద్భుతాలు సృష్టించడమే మిగిలింది. ‘శాఫ్’ క్రీడల్లో తొలి అంతర్జాతీయ స్వర్ణంతో మెరిసిన అతను ఆ తర్వాత ఎదురు లేకుండా దూసుకుపోయాడు. పోలండ్‌లో ప్రపంచ అండర్–20 చాంపియన్ షిప్‌లో ప్రపంచ రికార్డులతో పసిడి గెలవగా.. పేరుకే జూనియర్ అయినా ఆ ప్రదర్శన అతనికి సీనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు కల్పించింది. ఇక ఆ తర్వాత నీరజ్ వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. 2019లో గాయం, శస్త్రచికిత్స కారణంగా కాస్త వెనకడుగు వేసినా మళ్లీ దూసుకొచ్చి సత్తా చాటగలనని నీరజ్ తన విజయాలతో నిరూపించాడు.
ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది.
ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు. ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి.
పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణం, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు, ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ విజేత.. అథ్లెటిక్స్ ప్రపంచంలో అత్యుత్తమ విజయాలన్నీ నీరజ్ ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ప్రతి టోర్నీకి అదే మొదటి మ్యాచ్‌లాగా అదే తపనతో అతను సిద్ధమవుతున్నాడు.
ఇన్ని ఘనతల తర్వాత వేరేవారైనా కాస్త ఉదాసీనతకు చోటిస్తారేమో.. కానీ ఆర్మీలో సుబేదార్ అయిన 26 ఏళ్ల నీరజ్‌లో అదే కసి, అదే పట్టుదల! అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలు ఇప్పటికే అతని ఖాతాలో చేరాయి. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు ‘నీరజ్ చోప్రా స్టేడియం’గా పేరు పెట్టి రక్షణశాఖ నీరజ్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంది.
•మెహమ్మద్ అబ్ధుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment