
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీలు తలపడుతుండగా ఇరుజట్లలో ఇద్దరు కీలక ఆటగాళ్లు మిస్సయ్యారు. వారిద్దరూ ఆయా జట్లలో ఓపెనర్లగా కీలక పాత్ర పోషించినవారే. ఒకరు ముంబై ఇండియన్స్ ఆటగాడు క్వింటాన్ డీకాక్ అయితే మరొకరు ఆర్సీబీ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. ఇటీవల కరోనా బారిన పడ్డ దేవదత్ పడిక్కల్‌కు విశ్రాంతి ఇస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోగా, డీకాక్ ఇంకా క్వారంటైన్‌లో ఉన్నాడు.
దేవదత్ పడిక్కల్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో తొలి మ్యాచ్ తుది జట్టులో అవకాశం దక్కలేదని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్‌కు వచ్చిన క్రమంలో స్పష్టం చేశాడు. తాము ఆడే రెండో గేమ్ నాటికి పడిక్కల్ అందుబాటులోకి వస్తాడని కోహ్లి తెలిపాడు. దాంతో రజత్ పాటిదార్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఇతను కోహ్లితో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక డీకాక్ ఇంకా క్వారంటైన్‌లో ఉన్నాడు. దాంతో ముంబై తరఫున అరంగేట్రం చేసిన క్రిస్ లిన్ ఓపెనర్‌గా దిగాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో జాన్సెన్ కూడా ముంబై తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment