IPL 2021 2nd Phase: ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే విజయం | IPL 2021: Mumbai Indians Vs CSK Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2021 2nd Phase CSK VS MI: ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే విజయం

Published Sun, Sep 19 2021 7:08 PM | Last Updated on Mon, Sep 20 2021 8:33 PM

IPL 2021: Mumbai Indians Vs CSK Match Live Updates And Highlights - Sakshi

ఫైల్‌ ఫోటో

ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే విజయం
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయాన్ని అందుకుంది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేక చతికిలపడి 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటింగ్‌లో సౌరబ్‌ తివారి 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మన్‌ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లలో బ్రేవో మూడు, దీపక్‌ చహర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమికి సీఎస్‌కే బదులు తీర్చుకున్నట్లు అయింది.

సగం వికెట్లు కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. హేజిల్‌వుడ్‌ వేసిన బంతికి పొలార్డ్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. ముంబై రివ్యూ కోరినప్పటికి రిప్లేలో బంతి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు క్లియర్‌గా కనిపించింది. ప్రస్తుతం ముంబై 14 ఓవర్ల తర్వాత ముంబై 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం  సౌరబ్‌ తివారి 24, కృనాల్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ బ్రేవో బౌలింగ్‌లో రైనాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై..
సీఎస్‌కే విధించిన 157 పరుగుల లక్ష్యచేధనలో ముంబై ఇండియన్స్‌ తడబడుతుంది. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరబ్‌ తివారి 6, ఇషాన్‌ కిషన్‌ 3 పరుగులు చేశారు. అంతకముందు సూర్యకుమార్‌ యాదవ్‌(3), అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌(17) వెనుదిరిగారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై.. డికాక్‌ ఔట్‌
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. దీపక్‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ రెండో బంతికి 17 పరుగులు చేసిన డికాక్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడంతో ధోని రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌లో వికెట్‌ను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో 18 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ 4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 34 పరుగులు చేసింది. అమన్‌మోల్‌ ప్రీత్‌ 16, సూర్యకుమార్‌ 1 పరుగుతో ఆడుతున్నారు.

రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపులు ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ 157
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఒక దశలో 10 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. చెన్నై స్కోరు కనీసం వంద పరుగులైనా దాటుతుందా అనే అనుమానం కలిగింది. తర్వాత వచ్చిన ధోని కూడా 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రం చక్కని ఇన్నింగ్స్‌తో అలరించాడు. 57 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. జడేజా 26 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్రేవో 8 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రుతురాజ్‌ మెరుపులతో సీఎస్‌కే గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో నిలకడగా ఆడతున్న సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. స్కోర్‌ బోర్డ్‌  107 పరుగుల వద్ద జడేజా 26 వికెట్‌ కోల్పోయింది.  బూమ్రా బౌలింగ్‌లో సూర్యకూమర్‌ యాదవ్‌ క్యాచ్‌ ఇచ్చి జడేజా వెనుదిరిగాడు. 18 ఓవర్లు పూర్తి అయ్యే సరికి చెన్నై జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 117 పరుగులు సాధించింది. రుతురాజ్‌ 67, బ్రేవో 8 పరుగులు చేశాడు.

రూతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ సెంచరీ
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఒపెనర్‌ రూతురాజ్‌ గైక్వాడ్‌ ఆర్ధ సెంచరీ సాధించాడు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై జట్టును రూతురాజ్‌ గైక్వాడ్‌ ఆదుకున్నాడు. జడేజాతో కలిసి 69 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 

పుంజుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌..
పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నై జట్టును ఒపెనర్‌  రూతురాజ్‌ గైక్వాడ్‌ ఆదుకున్నాడు.  జడేజాతో కలిసి  గైక్వాడ్‌ స్కోర్‌ బోర్డును చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 15 ఓవర్లు పూర్తి అయ్యే సరికి చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 87 పరుగులు సాధించింది. క్రీజులో రుతురాజ్ , జడేజా 25 పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు సాధించారు.

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్ల ధాటికి చెన్నై  పీకల్లోతు కష్టాల్లో పడింది.  పది ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 44  పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ 23, జడేజా 7పరుగులతో ఉన్నారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, మిల్నే 2 వికెట్లు సాధించారు.

ధోని ఔట్‌..27 పరుగులకే నాలుగు వికెట్లు..
చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస క్రమంలో వికెట్లను కోల్పోతుంది. స్కోర్‌ బోర్డ్‌ 24 పరుగుల వద్ద కెప్టెన్‌ ధోని(3) వికెట్‌ కోల్పోయింది. ఆడామ్‌ మిల్నే బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. రుతురాజ్‌ (17), జడేజా(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

రైనా ఔట్‌.. ఏడు పరుగులకే మూడో వికెట్ డౌన్‌
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన రైనా బౌల్ట్‌ బౌలింగ్‌లో రాహుల్‌ చహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే ఏడు పరుగులకే మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు అంబటి రాయుడు రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. రుతురాజ్‌ 5, ధోని (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

సీఎస్‌కే 2 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆడమ్‌ మిల్నే బౌలింగ్‌లో మోయిన్‌ ఆలీ సౌరబ్‌ తివారీకి క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 2 వికెట్ల నష్టానికి 3 పరుగులు చేసింది. రుతురాజ్‌ 1, రాయుడు(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

►డుప్లిసిస్‌ డకౌట్‌.. సీఎస్‌కే తొలి వికెట్‌ డౌన్‌
సీఎస్‌కేకు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. బౌల్ట్‌ వేసిన ఓవర్‌ తొలి ఓవర్‌ మూడో బంతికి డుప్లెసిస్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. షార్ట్‌బాల్‌ను అంచనా వేయడంలో పొరబడ్డ డుప్లెసిస్‌ మిల్నేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై పరుగులేమి చేయకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. 

దుబాయ్‌: ఐపీఎల్ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు తెరలేచింది. రెండో అంచె పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరుగుతుంది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ లేమి కారణంగా మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.అతని స్థానంలో పొలార్డ్‌ నాయకత్వం వహించనున్నాడు. ఇక హార్దిక్‌ పాండ్యా కూడా మ్యాచ్‌లో ఆడడం లేదు. ముంబై తరపున అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక సీఎస్‌కే జట్టులో సామ్‌ కరన్‌ స్థానంలో బ్రావో జట్టులోకి వచ్చాడు.

ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్లు పోటాపోటీగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌ ప్రదర్శన చూసుకుంటే సీఎస్‌కే ముందంజలో ఉంది. అయితే సీజన్‌లో తొలి అంచె పోటీలో ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే తొలుత భారీ స్కోరు చేసినప్పటికీ.. పొలార్డ్‌ (87 పరుగులు, 34 బంతులు) విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్‌ వన్‌సైడ్‌గా మారిపోయింది. అయితే కరోనా కారణంగా లీగ్‌ వాయిదా పడడం.. మధ్యలో గ్యాప్‌ రావడం ఆటను సరికొత్తగా మార్చేసింది. ఎవరు ఫెవరెట్‌ అనేది పక్కన పెడితే మరోసారి పరుగుల వరద​ ఖాయంగా కనిపిస్తుంది. 

ముంబయి, చెన్నై జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 32 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 19 మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్ గెలుపొందగా.. మిగిలిన 13 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఓవరాల్‌గా ముంబయి టీమ్ ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. చెన్నై జట్టు మూడు సార్లు టైటిల్ గెలిచింది. 

ముంబై ఇండియన్స్‌: కీరన్‌ పొలార్డ్‌ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌‌, ఇషాన్‌ కిషన్‌, అన్‌మోల్‌ ప్రీత్‌సింగ్‌, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్‌ తివారి,కృనాల్ పాండ్యా, ఆడమ్‌ మిల్నే, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

సీఎస్‌కే:  ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), డుప్లెసిస్‌, రుతురాజ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా,జోష్‌ హాజిల్‌వుడ్‌, డ్వేన్‌ బ్రావో, శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement