IPL 2023, GT Vs SRH: 'Happy For Him', Says Markram After Losing To GT - Sakshi
Sakshi News home page

Aiden Markram: ఒక్కరం కూడా సహకారం అందించలేకపోయాం.. టోర్నీ నుంచి ఇలా నిరాశగా! అతడు మాత్రం అద్భుతం..

Published Tue, May 16 2023 9:53 AM | Last Updated on Tue, May 16 2023 10:18 AM

IPL 2023 GT Vs SRH Markram After Eliminated From Tourney: Happy For Him - Sakshi

ఒంటరి పోరాటం చేసిన హెన్రిచ్‌ క్లాసెన్‌- భువీ సైతం (PC: IPL)

IPL 2023- GT Vs SRH: ‘‘పవర్‌ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది. అప్పుడే మేము పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాం. మా నుంచి గేమ్‌ చేజారిపోయింది’’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ అన్నాడు. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అద్భుతంగా రాణించారని.. అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయాడు.

రైజర్స్‌ అవుట్‌
ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌తో సోమవారం మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో టైటాన్స్‌ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. రైజర్స్‌ అధికారికంగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

గిల్‌ సెంచరీతో
స్టార్‌ పేసర్‌ భువీ.. టైటాన్స్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహాను డకౌట్‌ చేసి శుభారంభం అందించాడు. కానీ మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆ ఆనందాన్ని నిలవకుండా చేశాడు. అతడికి వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ కూడా తోడయ్యాడు. మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన వేళ గిల్‌ సెంచరీ(58 బంతుల్లో 101 పరుగులు)తో చెలరేగగా.. సాయి 47 పరుగులతో రాణించాడు.

కుప్పకూలిన టాపార్డర్‌
వీరిద్దరి అద్బుత ప్రదర్శన కారణంగా సొంతమైదానంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి గుజరాత్‌ 188 పరుగులు స్కోరు చేసింది. భువీ మొత్తంగా 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్‌ టాపార్డర్‌ కుప్పకూలింది. టైటాన్స్‌ పేసర్‌ షమీ ధాటికి కకావికలమైంది.

ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌(5), అభిషేక్‌ శర్మ (4) పూర్తిగా నిరాశపరిచారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ మార్కరమ్‌(10) వైఫల్యం కొనసాగించాడు. రాహుల్‌ త్రిపాఠి(1) తప్పుడు షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ పారేసుకున్నాడు. 

పాపం క్లాసెన్‌
జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ క్లాస్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్తపడుతూనే వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఓ వైపు టపాటపా వికెట్లు పడుతున్నా.. సంయమనంతో ఓపికగా ఆడాడు. 

భువీ నుంచి సహకారం అందడంతో 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. క్లాసెన్‌ కారణంగా ఏదో అద్భుతం జరుగబోతుందని ఆశించిన ఆరెంజ్‌ ఆర్మీ ఆశలపై నీళ్లు చల్లుతూ 17వ ఓవర్‌ ఐదో బంతికి షమీ అతడిని పెవలియన్‌కు పంపాడు. తర్వాత భువీ(27) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 34 పరుగుల తేడాతో రైజర్స్‌ ఓటమిపాలైంది.


మార్కరమ్‌ (PC: IPL) 

సహకారం అందించలేకపోయాం.. అంతా మావల్లే
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మార్కరమ్‌ మాట్లాడుతూ.. ‘మా జట్టులో బంతిని స్వింగ్‌ చేయగల వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లు ఉన్నారు. భువీ ఈరోజు అద్భుతంగా ఆడాడు. అతడికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే! అయితే, శుబ్‌మన్‌ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.

అతడు అద్భుతం
ఇక క్లాసెన్‌ తాను ఎంతటి అద్భుతమైన బ్యాటరో మరోసారి నిరూపించాడు. క్లాస్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ మాలో ఒక్కరం కూడా అతడికి సహకారం అందించలేకపోయాం. తన పోరాటం వృథాగా పోవడం నిజంగా దురదృష్టకరం. 

మిగిలిన రెండు మ్యాచ్‌లలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చే అంశం గురించి ఆలోచిస్తాం. ఈ ఏడాది కూడా నిరాశగా టోర్నీని ముగించడం బాధిస్తోంది. ఈ మ్యాచ్‌లో మమ్మల్ని పోటీలో ఉంచేందుకు భువీ శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ మేము మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయాం’’ అని విచారం వ్యక్తం చేశాడు.

చదవండి: తండ్రి లాంటి వారు చనువుగా, ఏదో తెలిసీ తెలియక తాకితే అపార్థం చేసుకుంటారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement