రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఆ ఫ్రాంచైజీ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుభవార్త చెప్పాడు. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఐపీఎల్ ఆడతానని ఆర్సీబీ అభిమానుల్లో జోష్ నింపాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌ను 'ఇక నడవలేను' అనుకునే వరకు ఆడతానని తెలిపాడు. తన జీవితంలో ఐపీఎలే తన చివరి క్రికెట్ టోర్నీ అవుతుందని అన్నాడు. తన కెరీర్‌కు ఐపీఎల్ ఎంతో మేలు చేసిందని.. ఐపీఎల్‌లో తాను కలిసిన ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని.. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, డుప్లెసిస్ లాంటి ఆటగాళ్లతో భుజాలు రాసుకుంటూ గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యాడు.
ఐపీఎల్‌లో దీర్ఘకాలంపాటు కొనసాగుతానని మ్యాక్సీ చెప్పకనే చెప్పడంతో ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్సీపై గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఈ విధ్వంసకర ఆటగాడు ఈసారి ఎలాగైనా ఆర్సీబీకి టైటిల్ అందిస్తాడని నమ్మకంగా ఉన్నారు. మ్యాక్సీ ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీ అతన్ని దూరం చేసుకోదని గట్టిగా నమ్ముతున్న అభిమానులు.. కోహ్లితో ఉన్న సాన్నిహిత్యం అతన్ని ఆర్సీబీకి దూరం చేయదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలను మదిలో పెట్టుకునే ఆర్సీబీ అభిమానులు ప్రస్తుత మ్యాక్సీ స్టేట్‌మెంట్ విని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఐపీఎల్‌తో మ్యాక్స్‌వెల్‌కు పదేళ్లకు పైగా అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. 2012 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మొదలైన అతని ప్రస్తానం.. ఆతర్వాత ముంబై, పంజాబ్ ఫ్రాంచైజీలతో విజయవంతంగా సాగింది. ఈ ఆసీస్ విధ్వంసకర ఆటగాడు కోహ్లి ప్రత్యేక చొరవతో 2021 సీజన్‌లో ఆర్సీబీతో జతకట్టాడు. ప్రస్తుతం ఆర్సీబీ మ్యాక్సీకి 14.25 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లిస్తుంది. గత సీజన్‌లో అతను 183.49 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. మ్యాక్స్‌వెల్ ఇటీవలి భారత పర్యటనలోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో (వరల్డ్‌కప్‌లో 2, టీ20 సిరీస్‌లో ఒకటి) విరుచుకుపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment