
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌లో చెలరేగిపోతున్నాడు. గత 12 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 9 హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించాడు. ఈ మధ్యలో రియాన్ చేసిన స్కోర్లపై లుక్కేస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.
ఈ విధ్వంసకర ఆటగాడు గత 12 ఇన్నింగ్స్‌ల్లో 178.72 స్ట్రయిక్‌రేట్‌తో 107.83 సగటున 647 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే రియాన్ పొట్టి ఫార్మాట్‌పైకి సునామీలా దూసుకొస్తున్నట్లనిపిస్తుంది. రియాన్ తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తే టీ20 ఫార్మాట్‌ను శాశించడం ఖాయం.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌ల్లో 160కిపైగా స్ట్రయిక్‌రేట్‌తో 181 సగటున రెండు హాఫ్ సెంచరీల సాయంతో 181 పరుగులు చేసిన రియాన్.. దిగ్గజ విరాట్ కోహ్లితో కలిసి సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించిన రియాన్.. ప్రస్తుత సీజన్‌లో వరుసగా 43 (29), 84 నాటౌట్ (45), 54 నాటౌట్ (39) స్కోర్లు చేశాడు.
ముంబైతో మ్యాచ్‌లో సహచరులంతా తక్కువ స్కోర్లకే ఔటైతే రియాన్ ఒక్కడే నిలదొక్కుకుని మెరుపు ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. గత 12 ఇన్నింగ్స్‌ల్లో రియాన్ పరాగ్ చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి.
61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39)
ముంబైతో మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3) సత్తా చాటడంతో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శన చేసి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై ఇన్నింగ్స్‌లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment