అభిమానులకు క్షమాపణ చెప్పిన ఆర్సీబీ (PC: RCB)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తమ అభిమానులకు క్షమాపణ చెప్పింది. ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.
కాగా ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించింది. విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ స్టార్లు, వుమెన్ ప్రీమియర్ లీగ్-2024లో చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ మహిళా జట్టు.. ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో ఆర్సీబీ తమ పేరు, లోగో మార్పులతో పాటు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది. అయితే, ఈ ఈవెంట్‌ను ఆర్సీబీ వెబ్‌సైట్, యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించాలంటే రూ. 99 చెల్లించాలని నిబంధన విధించింది. అయినప్పటికీ చాలా మంది అభిమానులు డబ్బు చెల్లించి ఈవెంట్‌ను చూసేందుకు సిద్ధమయ్యారు.
అక్కడ ఫ్రీగా స్ట్రీమింగ్
కానీ.. ప్రసారంలో ఇబ్బందులు తలెత్తడంతో తమ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో డబ్బు చెల్లించిన వాళ్లు.. ‘‘ఇదేం పద్ధతి’’ అంటూ ఆర్సీబీ తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో క్షమాపణ కోరుతూ ఆర్సీబీ ప్రకటన విడుదల చేసింది.
మీ డబ్బులు రీఫండ్ చేస్తాం
‘‘ప్రియమైన ఆర్సీబీ అభిమానులారా.. పెద్ద ఎత్తున ఈ ఈవెంట్‌కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా అంతరాయం కలిగింది.
అందుకే మీ డబ్బులు రీఫండ్ చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాం. రానున్న ఏడు రోజుల్లో మీ డబ్బు మీ అకౌంట్లకు చేరుతుంది. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు. తదుపరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఆర్సీబీ గురువారం తెలిపింది. కాగా ఈరోజు(మార్చి 22)న ఐపీఎల్-2024 ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్‌గైక్వాడ్ సారథ్యంలో చెన్నై.. ఫాఫ్ డుప్లెసిస్ బృందంతో తలపడనుంది.
చదవండి: ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: టీమిండియా మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment